CMRE College: సీఎంఆర్ కళాశాల ఘటనపై ప్రత్యేక కమిటీ!
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:52 AM
సీఎంఆర్ కళాశాల బాలికల వసతిగృహం ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ద్వారా వాస్తవాలను బయటకు తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం!
ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
కాలేజీలకు 2 రోజులు సెలవు ప్రకటించిన యాజమాన్యం
నిరసనలు విరమించి ఇంటి బాట పట్టిన విద్యార్థులు
మేడ్చల్ టౌన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ కళాశాల బాలికల వసతిగృహం ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ద్వారా వాస్తవాలను బయటకు తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కళాశాల వసతి గృహంలో బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కళాశాలకు యాజమాన్యం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ఆదివారంతో మొత్తం మూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఆందోళన విరమించి ఇంటి బాట పట్టారు. అయితే ఇది నిరసనలకు తాత్కాలిక విరామం మాత్రమేనని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. యాజమాన్యం సెలవులు ప్రకటించి తమ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిందని కొందరు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై మహిళా కమిషన్ కూడా సీరియ్‌సగా ఉంది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఇప్పటికే కళాశాలకు నోటీసులు జారీ చేయటంతో పాటు విచారణకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. వసతిగృహాంలో పనిచేసే సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లలోని డేటాలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బాత్రూమ్ వెంటిలేటర్‌పై వేలి ముద్రలు సేకరించినప్పటికీ వాటి ఆధారంగా వీడియోలు తీసిన వారిని గుర్తించడం కష్టతరమని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే వార్డెన్‌తో సహా సిబ్బంది వేలి ముద్రలను సేకరించి పరీక్షల కోసం పంపారు. హాస్టల్ నిర్వహణలో కొన్ని లోపాలను పోలీసులు, మహిళ కమిషన్ గుర్తించినట్టు సమాచారం.