SLBC Incident: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆశలు వదులుకుంటున్న అధికారులు..
ABN , Publish Date - Feb 27 , 2025 | 09:07 AM
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంకిగా మారడంతో దాన్ని కట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ (గురువారం) నుంచి కటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులపై అధికారులు ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగి ఆరు రోజులు కావడంతో వారు బ్రతికే ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో భారీ ఎత్తున మట్టి కూలడం, నీరు, బురద చేరడంతో ప్రాణాలతో ఉండే అవకాశం తక్కువని భావిస్తున్నారు. వారంతా బురదలోనే టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) చుట్టూ కూరుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఒకవేళ ప్రమాదంలో గాయపడినా నీళ్లు, ఆహారం లేకుండా జీవించడం కష్టమని చర్చించుకుంటున్నారు. కాగా, శనివారం ఉదయం 8:30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆరా తీస్తున్నారు. మూడ్రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగా.. బుధవారం నాడు రేవంత్ రెడ్డితో సమావేశంలోనూ ప్రధాని మోదీ టన్నెల్ ప్రమాదంపై ఆరా తీశారు.
నేటి నుంచే..
కాగా, కార్మికులను కాపాడేందుకు టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంకిగా మారడంతో దాన్ని కట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ (గురువారం) నుంచి కటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మిషన్ భారీగా దెబ్బతింది. ఆ తర్వాత ఒత్తిడితో దాని వ్యర్థాలు ముందుకు తోసుకువచ్చాయి. దాన్ని దాటి వెళ్తే గాని కార్మికులను కాపాడే ప్రయత్నాలు ఫలించవు. అయితే ప్రమాదం జరిగిన మూడో రోజునే వాటిని తొలగించేందుకు కట్టర్లు, జనరేటర్లు తీసుకెళ్లారు.
అయితే కట్ చేసేందుకు జయప్రకాశ్ అసోసియేట్స్ యాజమాన్యం ఒప్పుకోలేదు. భారీ ఖర్చుతో కూడుకోవడం, టీబీఎంను కట్ చేస్తే తిరిగి పనులు ప్రారంభించడం కష్టమవుతుందని భావించారు. కానీ, బుధవారం ఆ సంస్థ ఛైర్మన్ జయప్రకాశ్ గౌర్ ఢిల్లీ నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంత్రులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు, సహాయ బృందాలతో చర్చల అనంతరం టీబీఎంను కట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులు ప్రారంభం కానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
సద్గురు డ్యాన్స్‌కి ఫిదా అయిన జర్మనీ అమ్మాయి..
Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..