Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.2వేల కోట్లు!
ABN , Publish Date - Jan 11 , 2025 | 02:18 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగంలో మరో అడుగుపడింది. రహదారి నిర్మాణం కోసం సేకరించే భూములకు చెల్లించాల్సిన పరిహారంలో తమ వాటా కింద రూ.2వేల కోట్లను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వద్ద రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసింది.
ఉత్తర భాగం భూ సేకరణ కోసం ఎన్‌హెచ్‌ఏఐకి చెల్లించిన ప్రభుత్వం
హడ్కో నుంచి రుణం తీసుకున్న సర్కారు
నిర్వాసితులకు గరిష్ఠ పరిహారం
ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు
త్వరలో తేలనున్న పరిహారం లెక్కలు ఏప్రిల్-మేలో రోడ్డు పనులు ప్రారంభం!
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగంలో మరో అడుగుపడింది. రహదారి నిర్మాణం కోసం సేకరించే భూములకు చెల్లించాల్సిన పరిహారంలో తమ వాటా కింద రూ.2వేల కోట్లను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వద్ద రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసింది. హడ్కో నుంచి రుణం తీసుకోవడం ద్వారా సర్కార్.. ఈ నిధులను సమీకరించినట్లు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. రాష్ట్రాభివృద్ధిలో రీజినల్ రింగు రోడ్డు కీలకపాత్ర పోషిస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే భూ పరిహారం కింద చెల్లించాల్సిన రాష్ట్ర వాటాలో సింహభాగాన్ని ఎన్‌హెచ్‌ఏఐకి చెల్లించింది. ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద డిపాజిట్ చేసిన సొమ్ము ఎన్‌హెచ్‌ఏఐ దగ్గరే ఉంటుంది. భూ పరిహారం లెక్కలు తేలిన తరువాత రాష్ట్రం తరఫున ఇంకా ఏమైనా చెల్లించాల్సి వస్తే.. ఆ మేరకు ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది.
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం నిర్మాణానికి సంబంధించి గత ఏడాది డిసెంబరు 27న కేంద్రం టెండర్లను ఆహ్వానించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 14వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 17న టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వద్ద ముగియనుంది. మొత్తం 161 కిలోమీటర్ల మేర.. 5 ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నారు. భూ పరిహారం మినహా రూ.7,104 కోట్లతో రోడ్డు పనులు చేపట్టనున్నారు. అయితే, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలోపు రహదారికి అవసరమైన భూ సేకరణ పరిహారం విలువ కూడా తేలాల్సి ఉంది. దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర వాటాలు ఎంతనేది తేలనుంది. ఈ లోపు రహదారి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన దానిలో కొంతమొత్తాన్ని ఎన్‌హెచ్‌ఏఐకు చెల్లించాలని కేంద్రం ఎప్పటినుంచో చెబుతోంది. గత ప్రభుత్వం హయాంలోనూ ఈ విషయం దగ్గరే సమస్య తలెత్తగా.. పరిష్కారం కాలేదు.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వాటాలో కొంతమొత్తాన్ని ఎన్‌హెచ్‌ఏఐ వద్ద డిపాజిట్ చేసింది. ఉత్తర భాగం నిర్మాణానికి మొత్తం 1,895 హెక్టార్ల భూమి అవసరం పడుతుండగా... సేకరణ వ్యవహారం దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల భూ సేకరణ వివరాల అవార్డులను సైతం ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ అంశమూ పరిష్కారమైనట్టు తెలుస్తోంది. వాటికీ త్వరలోనే అవార్డులను ప్రకటించనున్నారు. అయితే, సేకరిస్తున్న భూములకు చెల్లించే పరిహారం చాలా తక్కువగా ఉందని భూ యజమానులు వాపోతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... గరిష్ఠ పరిహారాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతోంది. ఇది పూర్తయితే.. వెంటనే భూ యజమానులకు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తారు. ఉత్తరభాగం నిర్మాణానికి కేంద్ర అటవీ అనుమతులు వచ్చినప్పటికీ.. పర్యావరణ అనుమతులు రాలేదని సమాచారం. ఈ అంశాలన్నింటినీ కొలిక్కి తెచ్చి, ఏప్రిల్-మే నెల్లో ఉత్తరభాగం రహదారి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత సర్కారు తీరు వల్లే జాప్యం
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు మార్లు కేంద్రంతో విభేదించింది. ఉత్తరభాగం భూ సేకరణ పూర్తిచేసుకుని 3డీ గెజిట్ ప్రకటనకు సిద్ధమైన సమయంలో పరిహారం వాటా చెల్లించకుండా జాప్యం చేసింది. 3డీ గెజిట్‌ను జారీ చేస్తేనే తమ వాటా చెల్లిస్తామని కేంద్రంతో వాదించింది. అలా చేస్తే.. న్యాయ పరమైన సమస్యలు ఎదురవుతాయంటూ కేంద్రం తోసిపుచ్చింది. పరిహారం వాటా చెల్లింపుల కోసం 2022-23, 2023-24 బడ్జెట్లలో రూ.500 కోట్ల చొప్పున కేటాయించినా...నిధులు విడుదల చేయలేదు. భూపరిహారంలో రాష్ట్ర వాటాగా రూ.2,585కోట్లు, యుటిలిటీ షిఫ్టింగ్‌కు రూ.363.43కోట్లు చెల్లించాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక, గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం పనులపై దృష్టి పెట్టింది. రహదారి నిర్మాణం విషయంలో ఆటంకాలను తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్భంలోనే యుటిలిటీ చార్జీలను భరిస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చింది. మొత్తంగా భూపరిహారం వాటాలో సింహభాగాన్ని ఎన్‌హెచ్‌ఏఐకు అందించడం ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకేసింది.