Share News

Supreme Court: సుదీర్ఘకాలం విచారణా?

ABN , Publish Date - Jan 03 , 2025 | 03:24 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: సుదీర్ఘకాలం విచారణా?

  • దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేం

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తిరుపతన్న

  • బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • 4 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుంది: ప్రభుత్వ లాయర్‌

న్యూఢిల్లీ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తిరుపతన్న పాత్రపై సుదీర్ఘకాలంపాటు దర్యాప్తు కొనసాగడం సరికాదని తెలిపింది. దర్యాప్తు పేరుతో పిటిషనర్‌ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న తిరుపతన్న.. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ తిరస్కరణకు గురి కావడంతో గతేడాది అక్టోబర్‌ 20న సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై గురువారం జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్థార్థ్‌ దవే హాజరయ్యారు. సిదార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు.


ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తిరుపతన్న కీలక నిందితుడని చెప్పారు. ట్యాపింగ్‌కు పాల్పడడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. గత ప్రభుత్వ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్‌ చేశారని, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు.గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ట్యాపింగ్‌ ఆధారాలను ధ్వంసం చేశారని వివరించారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది సిద్థార్థ్‌ దవే వాదనలు వినిపిస్తూ తిరుపతన్న తొమ్మిది నెలలుగా జైలులో ఉన్నారని, ఆయన పాత్రపై ఇప్పటికే ఛార్జిషీట్‌ దాఖలైందని తెలిపారు. ఇంకా జైలులో ఉంచడం సరికాదని చెప్పారు. తప్పనిసరైతేనే జైలులో ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణకు ఇంకెంత కాలం పడుతుందో రాతపూర్వకంగా తమకు తెలపాలని, తిరుపతన్న పాత్రపై ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలు సమర్పించాలని అడిగింది. లూథ్రా సమాధానం చెబుతూ విచారణ పూర్తయ్యేందుకు మరో నాలుగు నెలలు సమయం పడుతుందని తెలిపారు. అఫిడవిట్‌ దాఖలుకు సమయం కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 27కు కోర్టు వాయిదా వేసింది.

Updated Date - Jan 03 , 2025 | 03:24 AM