Pre-Budget: బడ్జెట్ కసరత్తు షురూ
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:14 AM
రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను స్వీకరించింది.
గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమంపై భట్టి, సీతక్క సమీక్ష
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను స్వీకరించింది. శాఖలు, పథకాల వారీగా రాబడులు, వ్యయాల అంచనాలను, ఉద్యోగుల జీతభత్యాల వివరాలను అన్ని శాఖలు పంపించాయి. ఈ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల ప్రతిపాదనలపై సచివాలయంలో బుధవారం ఆయన ఆ శాఖల మంత్రి సీతక్కతో కలిసి సమీక్షించారు.
గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలోని కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయని, ఈ శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలని భట్టి విక్రమార్క, సీతక్క ఆకాంక్షించారు. జువైనల్ హోమ్స్‌లో ఉండే పిల్లల మానసిక పరిపక్వతకు క్రీడలు దోహదం చేస్తాయని, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి వారికి స్పోర్ట్స్ కిట్స్‌ను అందిస్తామని తెలిపారు. ఈ కిట్స్‌ను అందించాల్సిందిగా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డికి సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని మహిళా ప్రాంగణాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. దివ్యాంగులకు స్వల్పకాలిక శిక్షణ అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.