High Court: మార్గదర్శి కేసులో కౌంటర్లు సమర్పించని ఏపీ, తెలంగాణ
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:23 AM
నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందన్న కేసులో కౌంటర్ అఫిడవిట్‌లు దాఖ లు చేయనందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందన్న కేసులో కౌంటర్ అఫిడవిట్‌లు దాఖ లు చేయనందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ రుగుతున్న ఈ పిటిషన్‌పై ఇంత నిర్లక్ష్యం తగదని వ్యాఖ్యానించింది. మరోసారి మూడువారాల సమయం ఇస్తున్నామని, ఈసారి కౌంటర్‌లు దాఖలు చేయకపోతే ఇరు రాష్ట్రాల హోంశాఖ ముఖ్యకార్యదర్శులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. రిజర్వు బ్యాంకు చట్టానికి విరుద్ధంగా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎ్‌ఫ)గా ఉన్న మార్గదర్శి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందని పేర్కొంటూ 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ కేసును కొట్టేయాలని మార్గదర్శి 2011లో అప్పటి ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌ను 2018 డిసెంబరు 31(ఉమ్మడి హైకోర్టు విభజనకు చివరి తేదీ)న అనుమతించి ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టేసింది. ఈ ఆదేశాలపై పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ, ఉం డవల్లి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహా అందరి వాదనలు వినాలని సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టుకే పంపిం ది. అప్పటి నుంచి హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతోంది. తాజాగా ఈ పిటిషన్ జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రాధారాణి ధర్మాసం ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న మార్గదర్శి 200 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై సమాధానం ఇవ్వడానికి మూడువారాల సమయం కావాలని ఆర్బీఐ తరఫు న్యాయవాది కోరారు. డిసెంబరు 20లోపు ఉత్తరప్రత్యుత్తరాలు పూర్తిచేయాలని ఆ తర్వాత సమర్పించే ఏ పత్రాలనూ తీసుకోమని స్పష్టంగా తేదీ నిర్దేశించినప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కౌంటర్‌లు వేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది.