Share News

MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:40 PM

మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ..

MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..
MLC Elections 2025

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను లెక్కిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ జరిగింది. ఎవరు గెలిచినా మూడో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 56 మంది అభ్యర్థులు ఉన్నా.. నాలుగు, మూడు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియతోనే విజేత తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ పోలింగ్ ముగిసింది. విజేత ఎవరనేదానిపై ఎవరి అంచనాలు వారివి. ఓటింగ్ సరళి ఆధారంగా ఎవరికి విజయవకాశాలు ఎక్కువుగా ఉన్నాయో తెలుసుకుందాం.


గెలుపు అవకాశాలు ఎవరికంటే..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటినుంచి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీచేశారు. ఈ ఇద్దరూ విజయంపై ధీమాగా ఉన్నారు. పార్టీ కేడర్‌తో పాటు ఆర్థికంగా బలవంతులు కావడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ సైతం పట్టభద్రులు తనను గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటికీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారనేది ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తుది ఫలితం ఎలాఉన్నా.. మొదటి మూడు స్థానాల్లో మాత్రం నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ నిలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ముగ్గురిలో రెండు, మూడు ప్రాధాన్యత ఓట్లు అధికంగా పొందిన అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీ వాదం గట్టిగా వినిపించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన పట్టభద్రులు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని డిసైడ్ అయితే మాత్రం ప్రసన్న హరికృష్ణ మొదటి లేదా రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ టికెట్ ఆశించి.. టికెట్ రాకపోవడంతో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ వైపు పట్టభద్రులు మొగ్గుచూపారనే ప్రచారం ఎక్కువుగా జరుగుతోంది. ప్రధానపోటీ మాత్రం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ మధ్య ఉండొచ్చని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది.


రెండో ప్రాధాన్యత ఓటుతో..

ప్రసన్న హరికృష్ణ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఆయన అధికారపార్టీ వైపే ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో కొందరు ప్రసన్న హరికృష్ణకు లోపాయికారిగా సహకరించారనే ప్రచారం జరిగింది. దీంతో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన కాంగ్రెస్ సానుభూతిపరులు తప్పకుండా రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశం ఉంది. అలాగే అంజిరెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి పోటీచేస్తున్న శేఖర్ రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లలో ఎక్కువమంది ప్రసన్న హరికృష్ణకు రెండో ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో ప్రసన్న హరికృష్ణ గెలుస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది.


Also Read:

గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు

ఈ చిట్కా పాటిస్తే.. రూ. 40 వేలు మీ జేబులోకే..

రూ. 108కే రీఛార్జ్ ప్లాన్.. డేటాతోపాటు కాల్స్ కూడా..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 27 , 2025 | 04:40 PM