Share News

Bhatti Vikramarka: హరిత హైడ్రోజన్‌ హబ్‌గా తెలంగాణ

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:44 AM

రానున్న రోజుల్లో హరిత హైడ్రోజన్‌ హబ్‌గా తెలంగాణను మారుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Bhatti Vikramarka: హరిత హైడ్రోజన్‌ హబ్‌గా తెలంగాణ

  • పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి

  • ఆవిష్కరణల కేంద్ర బిందువుగా ఐఐటీహెచ్‌

  • వర్క్‌షా్‌పలో డిప్యూటీ సీఎం భట్టి

  • ఐదేళ్లలో లిథియం ప్రాసెసింగ్‌ ప్లాంట్‌: సింగరేణి సీఎండీ

కంది/కొత్తగూడెం, జనవరి 3 (ఆంఽధ్రజ్యోతి): రానున్న రోజుల్లో హరిత హైడ్రోజన్‌ హబ్‌గా తెలంగాణను మారుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంట్లకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, 2030 నాటికి 2వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో శుక్రవారం ఏఐసీఎంఆర్‌హెచ్‌ (ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ హబ్‌) వర్క్‌షా్‌పను శుక్రవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఖనిజ ఉత్పత్తులు, పరిశోధనల కోసం ఐఐటీహెచ్‌తో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. భట్టి సమక్షంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, సింగరేణి సీఎండీ బలరాం ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఖనిజాల అంచనా, క్లిష్టమైన ఖనిజాల వెలికితీతకు వ్యూహాలు, ఖనిజాల రీసైక్లింగ్‌ తదితర అంశాలపై శాస్త్రవేత్తలు చర్చించనున్నారు.


ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌.. కలల కర్మాగారమని, ఆవిష్కరణల కేంద్ర బిందువని కొనియాడారు. ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఇంజిన్‌ వంటిదని ప్రశంసించారు. క్లిష్టమైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం అనేవి.. ఆర్థిక వ్యవస్థకు నిర్మాణ వస్తువులని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై దృష్టి , శాస్త్రీయ ఆవిష్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. సదస్సులో సింగరేణి సీఎండీ బలరాం మాట్లాడుతూ సింగరేణి పరిధిలో ప్రస్తుతం 245.5 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయగా, మరో 259 మెగావాట్ల ప్లాంట్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది నాటికి వీటిని పూర్తి చేయడం ద్వారా నెట్‌ జీరో ఎనర్జీ కంపెనీగా సింగరేణి గుర్తింపు సాధించనుందన్నారు. రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్‌ తయారీ, బొగ్గు నుంచి మిథనాల్‌ తయారీ, పంప్డ్‌ స్టోరేజీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విదేశాల్లో లిథియం మైనింగ్‌కు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో తెలంగాణలోనే ప్రయోగాత్మకంగా లిథియం ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ స్థాపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి వెలువడుతున్న బూడిదలో 500పీపీఎంల పరిమాణంలో అరుదైన ఖనిజాలు ఉన్నట్లు తేలిందని, వీటిని వినియోగించుకునే అవకాశాలపై అధ్యయనం చేయిస్తామన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 04:44 AM