కృష్ణా జలాలపై రాజీమార్గం
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:42 AM
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని.. వాస్తవిక సాగు, తాగు నీటి అవసరాలను అంచనా వేయాలని, పరస్పర అంగీకారంతో రాజీ మార్గంలో నడవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.

వాస్తవ నీటి అవసరాలు తేల్చడానికి ఇద్దరు సీఈలతో కమిటీ వేసిన కృష్ణాబోర్డు
ఆ నివేదిక వచ్చాక.. నీటి విడుదలపై నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని.. వాస్తవిక సాగు, తాగు నీటి అవసరాలను అంచనా వేయాలని, పరస్పర అంగీకారంతో రాజీ మార్గంలో నడవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. జూలై దాకా సాగు, తాగు నీటి అవసరాలపై చర్చించడానికి జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైౖర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సోమవారం అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్, ఈఎన్‌సీ(ఓ అండ్ ఎం) విజయభాస్కర్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్, సాగర్ ఈఈ శ్రీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే పరిమితికి మించి నీటిని తరలించినందున...తదుపరి నీటిని ఏపీ తరలించకుండా అడ్డుకోవాలని తెలంగాణ అధికారులు కోరారు.
రానున్న మే 31వ తేదీ దాకా కల్వకుర్తి, నాగార్జునసాగర్ ఎడమకాలువ, ఏఎమ్మార్పీ కింద 90 టీఎంసీలు, తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీలు కలుపుకొని 107 టీఎంసీలు తమకు కేటాయించాలని, జూన్ 1 నుంచి జూలై 31వరకు తాగునీటి అవసరాల కోసం 9 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 6.38 లక్షల ఎకరాలు, కల్వకుర్తి కింద 2.80 లక్షల ఎకరాలు, ఏఎమ్మార్పీ/ఎ్‌సఎల్‌బీసీ కింద 2.39 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయని, ఈ తరుణంలో నీరు విడుదల చేయకుంటే ఇబ్బందులు ఏర్పడుతాయని నివేదించారు. అయితే, తమ రాష్ట్రంలోనూ సాగు నీటి అవసరం భారీగానే ఉందని ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. అయితే, సాగర్‌లో నీటి లభ్యత ఆధారంగా కుడి, ఎడమ కాలువల నీటి అవసరాలను తేల్చడానికి నల్లగొండ సీఈ, నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ సీఈతో ఓ కమిటీని వేస్తూ కృష్ణాబోర్డు నిర్ణయం తీసుకుంది. ఇద్దరు సీఈలు మంగళవారం నల్లగొండలో సమావేశమై.. రెండు రాష్ట్రాల్లోనూ ఏ మేరకు సాగు నీటి అవసరం ఉంది? అనే అంశంపై పరస్పరం చర్చించుకొని, నివేదికను బోర్డుకు సమర్పించనున్నారు. ఈనెల 27న జరగనున్న సమావేశంలో తెలుగు రాష్ట్రాల విజ్ఞప్తులపై చర్చించి, నీటి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.