Share News

Sridhar Babu: అంకుర సంస్థలకు కేరాఫ్‌ తెలంగాణ

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:48 AM

నూతన ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా, అంకుర సంస్థలకు చిరునామాగా తెలంగాణ దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Sridhar Babu: అంకుర సంస్థలకు కేరాఫ్‌ తెలంగాణ

  • రాయదుర్గంలో ఆరిక్ట్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌

  • ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): నూతన ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా, అంకుర సంస్థలకు చిరునామాగా తెలంగాణ దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్స్‌ యూనివర్సిటీతో నైపుణ్యమున్న మానవ వనరులకు తెలంగాణ కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలవబోతుందని, దీంతో రాష్ట్రంలో ప్రతీ ఏటా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఆరిక్ట్‌ సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరిక్ట్‌ నూతన కార్యాలయంతో 300 మందికి కొత్తగా ఉద్యోగాలు దొరుకుతాయని తెలిపారు.


హైదరాబాద్‌ అంటే టాలెంట్‌ సిటీ, టెక్‌ సిటీ, ఇన్నోవేషన్‌ సిటీ, స్టార్ట్‌ప్సకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఒక్క సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే కాదు ఫార్మా, బయోటెక్‌ తదితర రంగాల్లోనూ అనేక పరిశ్రమలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 6వేల అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయని, చిన్న, మధ్య తరహా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు 1500 దాకా ఉన్నాయని తెలిపారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఐటీ రంగం సాధించిన విప్లవాత్మక వృద్ధి వల్ల రాష్ట్ర జీడీపీ, తలసరి ఆదాయం జాతీయ సరాసరిని మించిపోయిందని శ్రీధర్‌ బాబు తెలిపారు. ఐటీ వార్షిక ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని చెప్పారు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలనుకునే కంపెనీలు మాతో కలిసి పనిచేసేందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

Updated Date - Jan 11 , 2025 | 02:48 AM