Support Scheme: చేనేతకు అభయహస్తం!
ABN , Publish Date - Jan 11 , 2025 | 02:33 AM
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రకటించింది. నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పేరుతో మూడు రకాల పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది.
నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాల అమలు
జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రకటించింది. నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పేరుతో మూడు రకాల పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు నిధులు కేటాయిస్తూ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ శుక్రవారం జీవో 3ను జారీ చేశారు. ఈ ఏడాది తెలంగాణ నేతన్న పొదుపు పథకానికి రూ.15 కోట్లు, చేనేత, పవర్‌లూమ్ కార్మికుల బకాయిలకు రూ.15 కోట్లు, నేతన్న భద్రతలో భాగంగా నేతన్న బీమా పథకానికి రూ.5.25 కోట్లు, నేతన్నకు భరోసా పథకానికి రూ.31 కోట్లు, వేతన ప్రోత్సాహకాలకు రూ.31 కోట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకం కింద చేనేత, పవర్‌లూమ్, అనుబంధ కార్మికులు వేతనాల నుంచి నెలవారీగా 8శాతం వాటాధనం జమ చేస్తారు.
దీని గరిష్ఠ పరిమితి రూ.1,200. ఇందుకు ప్రభుత్వం 16శాతం అందిస్తుంది. తెలంగాణ నేతన్న భద్రత పథకంలో నమోదైన కార్మికుడు ఏ కారణంగానైనా మృతిచెందినా రూ.5 లక్షలు అతని నామినీకి అందుతుంది. ఈ పథకంలో 65 ఏళ్ల గరిష్ఠ వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి బడ్జెట్ అంచనా వ్యయం రూ.9కోట్లు. తెలంగాణ నేతన్న భరోసా పథకం.. జియో ట్యాగ్ అయిన మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గరిష్ఠంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేల వేతన సహాయం అందిస్తారు. ఈ పథకం అమలుకు వార్షిక బడ్జెట్ అంచనా రూ.44 కోట్లు. ఇక తెలంగాణకు ప్రత్యేక చేనేత మార్క్ లేబుల్ రూపొందించారు. ఈ లేబుల్ ఉన్న వస్త్రాలకు ప్రోత్సాహం అందించనున్నారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లకు వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లు కేటాయించారు.
రూ.168కోట్లతో అమలు: తుమ్మల
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు చేనేత-జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు ఆమోదముద్ర వేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రూ.115 కోట్లతో తెలంగాణ నేతన్న పొదుపు, రూ.9 కోట్లతో తెలంగాణ నేతన్న భద్రత, రూ.44 కోట్లతో తెలంగాణ నేతన్న భరోసాను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే చేనేత రంగానికి రూ.874 కోట్లు విడుదల చేశామని, ఇందులో గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.465 కోట్లు ఉన్నాయన్నారు.