Movie Release: గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి
ABN , Publish Date - Jan 09 , 2025 | 03:52 AM
గేమ్ చేంజర్ సినిమా ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): గేమ్ చేంజర్ సినిమా ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు, అదనపు ఆటలకు అవకాశం ఇస్తూ బుధవారం హోంశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులిచ్చారు. రాత్రి 1 గంటకు వేసే ఒక్క బెనిఫిట్ షో మాత్రం రద్దు చేసిన ప్రభుత్వం.. ఈనెల 10వ తేదీ ఉదయం 4 గంటల షో తో కలిపి తొలిరోజు ఆరు షోలకు అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి మల్టీఫ్లెక్స్ థియేటర్లలో అదనంగా రూ.150, సింగిల్ స్ర్కీన్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతించింది.
అలాగే 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 9రోజుల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు సంబంధించి మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టికెట్ మీద రూ.100, సింగిల్ స్ర్కీన్‌కు సంబంధించి రూ.50 చొప్పున అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం కఠినంగా ఉంటుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించడం చర్చనీయాంశం అయింది. మరోవైపు.. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ల రేటు పెంపును పదిరోజుల వరకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలుచేయాలని స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.