Share News

KCR: నిపుణులతో చర్చించాకే.. కేసీఆర్‌పై చర్యలు

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:22 AM

విద్యుత్తు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్‌ మద న్‌ బి.లోకూర్‌ కమిషన్‌ నివేదికను అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)కి పంపించి, న్యాయనిపుణుల సలహా మేరకు మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

KCR: నిపుణులతో చర్చించాకే.. కేసీఆర్‌పై చర్యలు
KCR

  • లోకూర్‌ నివేదికను ఏజేకు పంపాలని క్యాబినెట్‌ నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్‌ మద న్‌ బి.లోకూర్‌ కమిషన్‌ నివేదికను అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)కి పంపించి, న్యాయనిపుణుల సలహా మేరకు మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించారు. అంతకు ముందు జరిగిన మంత్రివర్గంలోనూ దీనిపై చర్చ జరగ్గా.. తాజాగా మరోమారు లోతుగా పరిశీలన జరిపారు. మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాగానే.. మంత్రివర్గ సహచరుల ముందు సీఎం ఈ నివేదికను పెట్టారు. దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వం.. న్యాయనిపుణుల పరిశీలనకు పంపించి, తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. ఆయా నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు.. ఇతర పాత్రధారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడింది. వాస్తవానికి విద్యుత్తు నిర్ణయాలపై విచారణ కమిషన్‌ వేయాలనే నిర్ణయం శాసనసభలో తీసుకున్నందున.. నివేదికను అసెంబ్లీలో పెట్టాలా..? లేక కేసుకు సిద్ధమవ్వాలా? అన్న దానిపై చర్చ జరిగినట్లు సమాచారం.


విద్యుత్తు కొనుగోళ్లు, పవర్‌ ప్లాంట్ల నిర్మాణంలో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లపాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రివర్గం చర్చించింది. కాలంచెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌తో రానున్న 25 ఏళ్లకాలంలో రూ.9 వేల కోట్ల దాకా భారం ప్రజలపై పడనుందని చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం వల్ల రూ.3,642కోట్ల నష్టం జరిగిందని, అప్పట్లో పోటీ బిడ్డింగ్‌కు వెళ్లడం వల్ల కేరళకు యూనిట్‌ కరెంట్‌ రూ.3.60కే లభించిందని, వెయ్యి మెగావాట్ల కరెంట్‌ను తీసుకోవడానికి ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ఆ మేరకు కరెంట్‌ ఇవ్వకపోవడంతో ఆ స్థానంలో బహిరంగ విపణిలో కొన్న విద్యుత్తు వల్ల రూ.2వేల కోట్ల అదనపు భారం పడిందని మంత్రివర్గం ఆక్షేపించింది.


వడ్డీలు.. పెనాల్టీలు

కరెంట్‌ కొనుగోళ్లు జరిగినా.. ఛత్తీ్‌సగఢ్‌కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా వడ్డీలు/పెనాల్టీల రూపంలో లేట్‌పేమెంట్‌ కింద రూ.750 కోట్ల మేర చెల్లింపులు చేస్తున్నారని, ఇక వెయ్యి మెగావాట్ల కోసం పీజీసీఐఎల్‌(పవర్‌ గ్రిడ్‌)తో కారిడార్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ.. కరెంట్‌ను ఆ మేరకు తరలించకపోవడం వల్ల రూ.635 కోట్లు చార్జీలను కలుపుకొని ఛత్తీ్‌సగఢ్‌ కరెంట్‌తో రూ.3385 కోట్ల మేర భారం పడిందని కమిషన్‌ ఇచ్చిన నివేదికపైనా మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. మరో వెయ్యి మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద రూ.261 కోట్లు చెల్లించాలని పవర్‌గ్రిడ్‌ నోటీసు ఇవ్వడం(ఈ కేసు అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌లో ఉంది) పైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గోదావరి ఒడ్డున బొగ్గు నిల్వలున్నాయని, బొగ్గు గని ఉపరితల భాగం(పిట్‌హెడ్‌)లోనే ప్లాంట్‌లు కట్టాలని, దీనివల్ల విద్యుదుత్పత్తి ధర తగ్గుతుందని కేంద్ర విద్యుత్తు అథారిటీ(సీఈఏ) పలు దఫాలుగా గుర్తుచేసిందని, బొగ్గు గనులకు సగటున 280 కిలోమీటర్లదూరంలో(ఇల్లెందు 179 కిలోమీటర్లు, ఇతర గనులు 360 కిలోమీటర్లు) దూరంలో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టారని, దీనికి ఏటా బొగ్గు రవాణా చేయడానికి అయ్యే భారం రూ.1600 కోట్లుగా ఉంటుందని కమిషన్‌ తేల్చిన అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.

Updated Date - Jan 05 , 2025 | 07:21 AM