Share News

Hyderabad: 765 చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:37 AM

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ఉన్న 3,342 చెరువులకుగాను 765 చెరువుల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) హద్దులను గుర్తిస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

Hyderabad: 765 చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ

  • తుది నోటిఫికేషన్‌ జారీ చేశాం

  • మిగతా చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌

  • అభ్యంతరాలను పరిశీలించి తదుపరి ప్రక్రియ

  • హెచ్‌ఎండీఏలో మొత్తం 3,342 చెరువులు

  • రక్షణకు చర్యలు.. హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ఉన్న 3,342 చెరువులకుగాను 765 చెరువుల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) హద్దులను గుర్తిస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మిగతా చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌లు జారీ చేశామని.. వాటిపై అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత ఫైనల్‌ నోటిఫికేషన్‌ వెలువరిస్తామని పేర్కొంది. హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువుల ఆక్రమణలు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ల పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న నేపథ్యంలో.. అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తూ ఫైనల్‌ నోటిఫికేషన్‌లు జారీ చేయాల్సి ఉందని వెల్లడించింది. చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు, ఆక్రమణలకు తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటం వంటి చర్యల అవసరం ఉందని తెలిపింది.


ఈ మేరకు ఫైనల్‌ నోటిఫికేషన్‌లు ఇచ్చే అంశంపై ప్రత్యేకంగా ఒక సుమోటో పిటిషన్‌ను రిజిస్ట్రర్‌ చేసి ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేసింది. గురువారం ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత పరిస్థితిపై అదనపు స్థాయీ నివేదికను సమర్పించినట్లు పేర్కొన్నారు. 765 చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ చేశామని.. మిగతా వాటి విషయంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు చెరువుల హద్దులు గుర్తించడం తదితర అంశాల్లో హెచ్‌ఎండీఏ, ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయని, తదుపరి విచారణ నాటికి మంచి పురోగతి సాధించి ఆ వివరాలు నివేదిస్తామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. మరిన్ని వివరాలతో పనుల పురోగతిపై అదనపు స్థాయీ నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది.

Updated Date - Jan 03 , 2025 | 06:37 AM