Share News

జైళ్లలో అగరబత్తుల తయారీ!

ABN , Publish Date - Jan 14 , 2025 | 03:51 AM

ఆలయాల్లో పూజలకు వినియోగించిన పుష్పాలతో తిరుమల తిరుపతిలో అగరబత్తీలు తయారు చేస్తున్నారు. అదే తరహాలో తెలంగాణలోనూ అగరుబత్తీలు తయారు చేస్తున్నారు.

జైళ్లలో అగరబత్తుల తయారీ!

  • ఆలయాల్లో వాడిన పూలతో తయారీ.. కరీంనగర్‌ జైల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభం

  • త్వరలో మరికొన్ని జైళ్లలోనూ యూనిట్లు

  • పుష్పాలు ఇవ్వాలని కోరుతూ త్వరలో దేవాదాయ శాఖకు జైళ్ల శాఖ లేఖ

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో పూజలకు వినియోగించిన పుష్పాలతో తిరుమల తిరుపతిలో అగరబత్తీలు తయారు చేస్తున్నారు. అదే తరహాలో తెలంగాణలోనూ అగరుబత్తీలు తయారు చేస్తున్నారు. అయితే, వీటిని తయారు చేస్తున్నది ప్రైవేటు వ్యక్తులో, సంస్థలో కాదు.. జైళ్ల శాఖ!! ఈ అగరుబత్తీలను ఖైదీలతో తయారు చేయిస్తోంది. ఇప్పటికే పలు సబ్బులు, షాంపూలు, ఫినాయిల్‌ వంటి గృహోపయోగ వస్తువులు, ఫర్నిచర్‌, పుస్తకాలు, ఇతర వస్తువుల్ని జైళ్ల శాఖ తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తోంది. మార్కెట్‌లో లభించే వస్తువుల కంటే ధర తక్కువగా ఉండడం, నాణ్యంగా ఉండడంతో జైళ్ల శాఖ ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే జైళ్ల శాఖ అధికారులు అగరబత్తుల తయారీకి కూడా శ్రీకారం చుట్టారు. అది కూడా రసాయనాలు, ఇతర వస్తువులతో కాకుండా ఆలయాల్లో పూజలకు ఉపయోగించిన పూలను సేకరించి వాటి ద్వారా అగరబత్తులు తయారు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా జైల్లో అగరబత్తుల తయారీ యూనిట్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. స్థానిక ఆలయాల నుంచి సేకరించిన పుష్పాలతో అగరబత్తులు తయారు చేస్తున్నారు.


త్వరలోనే వాటిని మార్కెట్‌లో విక్రయించనున్నారు. ఇతర ఉత్పత్తుల మాదిరిగానే అగరబత్తుల్ని సైతం ఖైదీలతో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ సహాయ సహకారాలు తీసుకునేందుకు జైళ్ల శాఖ సిద్ధమైంది. జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల్లో నిత్యం స్వామి, అమ్మవార్ల పూజలు, ప్రత్యేక సందర్భాల్లో అలంకరణలకు ఉపయోగించే పుష్పాల్ని పారవేయకుండా తమకు ఇవ్వాలని కోరుతూ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు దేవాదాయ శాఖకు లేఖ రాయనున్నారు. ప్రస్తుతం ఆలయాల్లో నిత్య పూజలకు ఉపయోగించే పుష్పాలు, భక్తులు సమర్పించే దండలను ఆ తర్వాత పడేస్తున్నారు. ఇకపై దేవాదాయ శాఖ సహకారంతో పుష్పాలను సేరించి అగరబత్తుల తయారీకి ఉపయోగించుకోనున్నారు. సహజసిద్ధంగా తయారు చేస్తుండడంతో అగరబత్తులకు ప్రజల ఆదరణ బాగుంటుందని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ‘‘ఇతర వస్తువుల మాదిరిగానే ఖైదీలతో అగరబత్తులనూ తయారు చేయించాలని నిర్ణయించాం.


ఆలయాల్లో పూజలకు ఉపయోగించే పుష్పాల్ని సేకరించి, రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో అగరబత్తులను తయారు చేస్తాం. ప్రస్తుతం కరీంనగర్‌ జైల్లో తయారీ ప్రారంభించాం. దేవాదాయశాఖ సహకారంతో త్వరలో మరికొన్ని జైళ్లల్లో యూనిట్లు ఏర్పాటు చేస్తాం’’ అని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ‘‘ఆలయాల్లో నిత్యం స్వామి, అమ్మవార్ల పూజలకు, అలంకరణలకు ఉపయోగించే పుష్పాలను ఆ తర్వాత పారవేస్తున్నాం. అవసరమైన వారికి వాటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకోసం నామమాత్రపు రుసుము వసూలు చేయడం వల్ల ఆలయాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది’’ అని దేవాదాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - Jan 14 , 2025 | 03:51 AM