Damodara Rajanarsimha: ఔషధ పర్యవేక్షణకు జిల్లాల్లో త్రిసభ్య కమిటీలు
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:45 AM
తరచూ ఔషధాల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అంశంపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలోనూ ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఫార్మసీ, ఈ ఔషధీ వర్క్‌షా్‌పలో మంత్రి దామోదర
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తరచూ ఔషధాల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అంశంపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలోనూ ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ కమిటీలో డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జిల్లాలోని టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉంటారని వెల్లడించారు. అన్ని ఆస్పత్రుల్లో ఔషధాలుండేలా కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఫార్మసీ, ఈ-ఔషధి వర్క్ షాపును మంత్రి రాజనర్సింహ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందుల విషయంలో సమస్యలుంటే ఫార్మసిస్టులు కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫార్మసిస్టులు, డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఔషధాల పంపిణీకి వాహనాలు సమకూర్చినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఇండెంట్ పెట్టిన ఔషధాలన్నింటినీ ఇస్తున్నప్పటికీ, మందులు లేవని వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం ఏమిటో హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులు గుర్తించాలని, ఎక్కడైతే నిర్లక్షం జరుగుతుందో అక్కడ సంబంధిత అధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.