Share News

Khammam: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ABN , Publish Date - Jan 24 , 2025 | 03:55 AM

తల్లిదండ్రుల మాటకాదని.. వారు నచ్చజెప్పినా వినకుండా.. తాను మేజర్‌నని వాదిస్తూ మనసిచ్చినవాడిని మంతాంతర వివాహం చేసుకున్నఆ అమ్మాయి, తన ఆశలన్నీ ఛిద్రమయ్యాయని ఆవేదన చెందింది.

Khammam: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

  • ఆమెది ఉన్నత కుటుంబం.. కోచింగ్‌ సెంటర్లో పరిచయం, ప్రేమ

  • కన్నవారు అభ్యంతరపెట్టినా నచ్చినోడితో మతాంతర వివాహం

  • తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు.. ఆరేళ్లుగా సంబంధాలు కట్‌

  • పెళ్లయ్యాక ఆమె ఆశలు ఛిద్రం.. పనిలేక బలాదూర్‌గా భర్త

  • చోరీ కేసుల్లో అతడిని పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం

మధిర రూరల్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల మాటకాదని.. వారు నచ్చజెప్పినా వినకుండా.. తాను మేజర్‌నని వాదిస్తూ మనసిచ్చినవాడిని మంతాంతర వివాహం చేసుకున్నఆ అమ్మాయి, తన ఆశలన్నీ ఛిద్రమయ్యాయని ఆవేదన చెందింది. భర్త ఓ దొంగ అని తెలిసి.. పలుచోరీ కేసులకు సంబంధించి పోలీసులు ఇంటికొచ్చి మరీ భర్తను అదుపులోకి తీసుకోవడాన్ని చూసి తీవ్ర అవమానంగా భావించింది. దీనిపై ఇరుగుపొరుగు, బంధువర్గాల్లో ప్రచారం జరగడంతో ఇక తాను తలెత్తుకోలేనని.. అటు పుట్టింటికీ వెళ్లే పరిస్థితి లేదని భావించి బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే బిడ్డలు దిక్కులేని వారవుతారనుకుందో ఏమో.. ఐదేళ్లలోపు వయసున్న ఇద్దరు బిడ్డలను చంపి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర మం డలం నిదానపురంలో ఈ ఘటన జరిగింది. మృతురాలు 31 ఏళ్ల ప్రేజా అలియాస్‌ మౌనిక! ఈమె తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు. స్వస్థలం సూర్యాపేట.


హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నిదానపురం గ్రామానికి చెందిన షేక్‌ బాజీది వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలాన్ని తల్లిదండ్రులు సాగుచేస్తూనే కూలీ పనులకు వెళ్లేవారు. డిగ్రీదాకా చదువుకున్న బాజీ పోటీ పరీక్షల శిక్షణ కోసం రైల్లో విజయవాడ వెళుతుండగా ఆ పోటీ పరీక్షల శిక్షణ కోసం అదే రైల్లో ప్రయాణిస్తున్న మౌనిక అతడికి పరిచయమైంది. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఒకానొకరోజు మౌనికను బాజీ తన సొంతూరైన నిదానపురానికి తీసుకొచ్చాడు. ఇది తెలిసి.. మౌనిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి ఈ వివాహం వొద్దు అని మౌనికకు నచ్చజెప్పారు.. ఆమె వినలేదు. దీంతో వారు ఖమ్మం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను మేజర్‌ను అని.. తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటున్నానని మౌనిక స్పష్టంగా చెప్పడంతో పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అప్పుడే పుట్టింటితో మౌనికకు సంబంధాలు తెగిపోయాయి.


ముస్లిం సంప్రదాయ పద్ధతిలో మౌనికను బాజీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరును ప్రేజా గా మార్చాడు. వీరికి మెహక్‌ (5), మెనురూల్‌ (4) కూతు ళ్లు కలిగారు. అయితే బాజీ ఏ పనీ చేయకుండా బలాదూర్‌గా తిరుగుతున్నా, తన భర్త దొంగతనాలూ చేస్తున్నాడనే విషయం మౌనికకు తెలియదు. బైక్‌లు, సెల్‌ఫోన్ల చోరీ.. చైన్‌ స్నాచింగ్‌ కేసులకు సంబంఽధించి నిదానపురం వచ్చిన ఖమ్మం పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మౌనిక షాక్‌కు గురైంది. గురువారం ఉదయం తన ఇద్దరు పిల్లలను ఉరితీసి.. తాను కూడా దూలానికి ఉరివేసుకుంది. మౌనిక మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక తల్లిదండ్రులకు సమాచారం చేరవేయగా.. వారు నిదానపురం వచ్చేది రానిదీ చెప్పలేదని తెలిసింది. తమ అదుపులో ఉన్న బాజీని పోలీసులు గురువారం రాత్రి బయటకు పంపడటంతో అతడు ఖమ్మం ఆస్పత్రిలోని మార్చురీకి వచ్చినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Updated Date - Jan 24 , 2025 | 03:55 AM