Share News

Uttam: హరీశ్‌.. మాట్లాడేందుకు సిగ్గుండాలి

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:13 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల కారణంగానే సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కారేనని ధ్వజమెత్తారు.

Uttam: హరీశ్‌.. మాట్లాడేందుకు సిగ్గుండాలి

మీ సర్కారు విధానాలతోనే ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్‌.. ఎస్‌ఎల్‌బీసీ జాప్యానికి బీఆర్‌ఎస్సే కారణం

  • 3 నెలల్లో టన్నెల్‌ పనులు ప్రారంభిస్తాం

  • మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

నాగర్‌కర్నూల్‌/వనపర్తి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల కారణంగానే సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కారేనని ధ్వజమెత్తారు. గురువారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ‘హరీశ్‌.. మీ సలహాలు మాకు అవసరం లేదు. మీకంటే నిపుణులైన వారే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. తెలంగాణలో జేబులు నింపుకోవడానికి ఇరిగేషన్‌ శాఖను నాశనం చేసింది కేసీఆరే. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? మాట్లాడేందుకు సిగ్గుండాలి. మే మే మీకన్నా ఎక్కువ పని చేశామని చెప్పడం విడ్డూరంగా ఉంది. హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే. హరీశ్‌ మీకు సిగ్గుండాలి. మీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే లోపలికి అనుమతించకుండా నియంత పాలన చేశారు. రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులన్నీ నిరుపయోగంగా మారాయి. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెళ్తున్న రేవంత్‌ను అరెస్టు చేశారు. కాళేశ్వరంలో ఆరుగురు చనిపోతే ఎవరూ సమాధానం చెప్పలేదు. పాలమూరు రంగారెడ్డిలో పంపు కూలి ఆరుగురు చనిపోతే కనీసం స్పష్టత ఇవ్వలేదు. 25 మంది పిల్లలు కేసీఆర్‌ ఫాంహౌస్‌ దగ్గర చనిపోతే పట్టించుకున్న నాథుడే లేడు. జగన్‌తో కుమ్మక్కై కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేశారు. అలాంటి మీరు ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై మాట్లాడడం సిగ్గుచేటు’ అని బీఆర్‌ఎస్‌ నేతలపై ఉత్తమ్‌ మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మూడు రోజులు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుందని చెప్పారు. 3 నెలల్లో సొరంగం పనులు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


బీఆర్‌ఎ్‌సకు ఆ అర్హత లేదు: జూపల్లి

ఎస్‌ఎల్‌బీసీని పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పూర్తిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. వనపర్తిలో గురువారం మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు ఎస్‌ఎల్‌బీసీవద్దకు వెళ్లారని, తాము అడ్డుకోలేదని చెప్పారు. ఆయన అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రమాదంపై ప్రశ్నించే అర్హత బీఆర్‌ఎ్‌సకు లేదని.. 2007లో ప్రారంభమైన ప్రాజెక్టు పనుల్లో సింహభాగం కాంగ్రెస్‌ హయాంలోనే పూర్తయ్యాయని చెప్పారు.


ఆనాడు అనుమతిచ్చారా?: మహేశ్‌గౌడ్‌

ఎస్‌ఎల్‌బీసీ వద్ద హడావుడి చేస్తూ పత్రికలకు పోజులిస్తున్న హరీశ్‌రావు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో సందర్శించేందుకు ఏ మీడియా ప్రతినిధికైనా అనుమతినిచ్చారా అంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే.. బాహుబలి మోటార్లు వరద నీటిలో ఎందుకు మునిగాయని నిలదీశారు. వీటిపై చర్చకు సిద్ధమా అంటూ హరీశ్‌కు సవాల్‌ విసిరారు.

Updated Date - Feb 28 , 2025 | 05:13 AM