Venkatesh: పారితోషికమంతా వైట్‌లోనే!
ABN , Publish Date - Jan 24 , 2025 | 02:57 AM
తాను నటించే సినిమాలకు పారితోషికాన్ని పూర్తిగా వైట్‌లోనే (ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించే డబ్బునే) తీసుకుంటానని ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ వెల్లడించారు.

నేను తీసుకునేదే తక్కువ.. అది కూడా ఆఫీసులోనే
మిగతా వారి సంగతి తెలియదు: నటుడు వెంకటేశ్
‘సంక్రాంతికి వస్తున్నాం’ అన్నట్లుగా.. ఐటీ అధికారులు
సోదాలు సాధారణమే: దర్శకుడు అనిల్ రావిపూడి
సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ తనిఖీలు
ఫైనాన్షియర్ల వివరాలు, బినామీ ఖాతాల గుర్తింపు
దిల్ రాజు తల్లికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తాను నటించే సినిమాలకు పారితోషికాన్ని పూర్తిగా వైట్‌లోనే (ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించే డబ్బునే) తీసుకుంటానని ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ వెల్లడించారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయోత్సవ వేడుకను ఆ చిత్ర యూనిట్ గురువారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకటేశ్ విలేకర్లతో మాట్లాడుతూ ఐటీ సోదాలపై స్పందించారు ‘ఇండస్ట్రీలోని ప్రముఖుల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని అంటున్నారు. మిగతా హీరోలు పారితోషికం ఎలా తీసుకుంటున్నారనేది నాకు తెలియదు. నేను మాత్రం పారితోషికం మొత్తం వైట్‌లో తీసుకుంటా. అయినా నేను తీసుకునేదే తక్కువ. అది కూడా ఆఫీసులో నేరుగా తీసుకుంటా’ అని స్పష్టం చేశారు. సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘మేం మా సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పేరు పెట్టామని ఐటీ అధికారులు కూడా గట్టిగా ఫిక్సయినట్టున్నారు. మేం కూడా సంక్రాంతికి వస్తున్నాం అంటూ సోదాలు మొదలుపెట్టారు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. రెండుమూడేళ్లకోసారి సినిమా పరిశ్రమపై, వ్యాపార సంస్థలపైన ఐటీ సోదాలు జరగడం మామూలేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదనితెలిపారు. ‘మా నిర్మాత దిల్‌రాజు బాధపడడం లేదు. మేం వచ్చినా రాకపోయినా సినిమా ప్రమోషన్స్ ఆపొద్దు. ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్యన వేడుక చేసుకోవాలని చెప్పారు’ అని తెలిపారు.
కొనసాగుతున్న సోదాలు
సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా మూడోరోజైన గురువారం ఐటీ సోదాలు కొనసాగాయి. దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి, వ్యాపార భాగస్వామి శిరీష్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. దిల్ రాజు నుంచి పరోక్ష పెట్టుబడులు అందుకున్నట్లు భావిస్తున్న మ్యాంగో మూవీస్ సంస్థలోనూ సోదాలు జరిపారు. ఆ సంస్థ యజమాని రామ్‌ను ప్రశ్నించి పలు కీలక పత్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం. కొందరు ఫైనాన్షియర్ల వివరాలు, బినామీ ఖాతాల సమాచారాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, దిల్ రాజు తల్లి గురువారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. ఆమెను దిల్‌రాజు కుమార్తె ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా, ఫోన్ వచ్చిందంటూ ఐటీ అధికారిణి దిల్ రాజుకు ఫోన్ ఇవ్వబోగా.. ఆయన ఫోన్ తీసుకోకుండా అసహనం వ్యక్తంచేశారు. దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఇల్లు, ఆఫీసులోనూ సోదాలు జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, ఆ సంస్థ సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి.