Share News

Hyderabad: కిడ్నీ రూ.25 లక్షలు!

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:38 AM

వారు నిరుపేద ఒంటరి మహిళలు.. దానికితోడు పిల్లల పోషణ భారం.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు. దీన్నించి విముక్తి కోసం కిడ్నీలు అమ్ముకోవటానికి సిద్ధపడ్డారు.

Hyderabad: కిడ్నీ రూ.25 లక్షలు!

దాతలకు ఇచ్చింది రూ.4 లక్షలే

  • అలకనంద కిడ్నీ రాకెట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి

  • తమిళనాడుకు చెందిన ఇద్దరు పేద మహిళల నుంచి కిడ్నీలు

  • కర్ణాటకకు చెందిన న్యాయవాది, నర్సుకు కిడ్నీ మార్పిడి

  • వారి నుంచి రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షల వసూలు

  • ఘటనపై ప్రభుత్వం సీరియస్‌.. విచారణకు ప్రత్యేక కమిటీ

  • సర్కారుకు నివేదిక ఇచ్చిన కమిటీ.. ఆస్పత్రి గుర్తింపు రద్దు

  • ఆ ఆస్పత్రి యజమాని సుమంత్‌ డాక్టరే కాదని వెల్లడి

  • సుమంత్‌తోపాటు మరో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, మంగళ్‌హాట్‌, అడ్డగుట్ట, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): వారు నిరుపేద ఒంటరి మహిళలు.. దానికితోడు పిల్లల పోషణ భారం.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు. దీన్నించి విముక్తి కోసం కిడ్నీలు అమ్ముకోవటానికి సిద్ధపడ్డారు. భాష తెలియని ప్రాంతానికి వచ్చి ఆస్పత్రిలో చేరి కిడ్నీలు ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి లభించింది రూ.4 లక్షలు. కానీ, ఆ కిడ్నీని ఇతరులకు అమర్చి సొమ్ము చేసుకున్న వారు అక్షరాలా రూ.25 లక్షలు సంపాదించుకున్నారు. హైదరాబాద్‌లో బట్టబయలైన అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్‌లో వెలుగు చూసిన సంచలన అంశమిది. ఈ వ్యవహారంలో కిడ్నీలు దానమిచ్చిన ఇద్దరు మహిళలకు చెరో నాలుగు లక్షలు ఇవ్వగా.. కిడ్నీలు అమర్చుకున్న వారి నుంచి మాత్రం మొత్తం రూ.50 లక్షలు వసూలు చేశారు. ఇదంతా దళారులు, ఆస్పత్రుల జేబుల్లోకి వెళ్లినట్లు తేలింది. ఈ కిడ్నీ రాకెట్‌పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేంద్ర సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో డాక్టర్‌ కిరణ్మయి, డాక్టర్‌ మల్లిఖార్జున్‌, డాక్టర్‌ సాధన రాయ్‌ సభ్యులుగా ఉన్నారు.


ఈ కమిటీ అలకనంద ఆస్పత్రిని సందర్శించింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ దాతలు, గ్రహీతలతో కూడా మాట్లాడింది. ప్రాథమిక నివేదికను వైద్యవిద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ వాణికి ఇచ్చింది. అనంతరం డీఎంఈ ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి పూర్థిస్థాయి నివేదికను ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గుర్తింపు రద్దు చేయడమే కాకుండా సీజ్‌ చేసింది. ఈ వివరాల్ని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బులు ఆశ చూపి, ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను తీసుకువచ్చి కిడ్నీ మార్పిడి చికిత్సల ద్వారా డబ్బులు దండుకుంటున్నట్లు వెల్లడైంది. అలకనంద ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మాకు సమాచారం ఇవ్వగానే అధికారులను ఆస్పత్రి వద్దకు పంపించాం. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురిలో ఇద్దరు తమిళనాడు, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. భాషాపరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నాం. కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఇద్దరు.. తొలుత అధికారుల్ని తప్పుదోవ పట్టించే విధంగా అపెండెక్స్‌ చేయించుకున్నట్లు బుకాయించారు. కానీ, వైద్యులు గట్టిగా అడిగి చెకప్‌ చేయగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నామని వారు ఒప్పుకున్నారు’ అని డాక్టర్‌ వెంకటేశ్వరరావు వెల్లడించారు. అలకనంద ఆస్పత్రిలో యూరాలజీ డిపార్ట్‌మెంట్‌ నడిపేందుకు పర్మిషన్‌ లేదని తెలిపారు. ఆస్పత్రికి తొమ్మిది పడకలకు మాత్రమే అనుమతి ఉందని, కానీ, 35 పడకలుగా నడుపుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. అలకనంద ఆస్పత్రి యజమాని సుమంత్‌ని పోలీసులు అరెస్టు చేశారని, సుమంత్‌ డాక్టర్‌ కాదని తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన డాక్టర్ల పేర్లను సుమంత్‌ చెప్పడం లేదన్నారు.


నిరక్షరాస్యులే టార్గెట్‌గా కిడ్నీ రాకెట్‌

అలకనంద ఆస్పత్రిలో కిడ్నీలు విక్రయించిన ఇద్దరు మహిళలు నస్రీంబాను (38), ఫీర్దోజ్‌బాను (45) తమిళనాడులోని ఈరోడ్‌, చైన్నెకు చెందినవారుగా ప్రాథమిక విచారణలో తేలింది. నస్రీం ఇళ్లలో పని చేస్తుండగా, ఫీర్దోజ్‌ టైలరింగ్‌ పనులు చేస్తున్నట్లు వెల్లడైంది. వీరిద్దరూ భర్తలు దూరమైన ఒంటరి మహిళలు. ఓవైపు పిల్లల పోషణ, మరోవైపు ఉన్న అప్పుల కారణంగా మూత్రపిండాలను అమ్ముకునేందుకు వీరు అంగీకరించినట్లు సమాచారం. ఇద్దరూ పూర్తి నిరక్షరాస్యులు కావడంతో చాలా తేలిగ్గా వారిని దళారులు టార్గెట్‌ చేశారు. జనవరి 16న వీరు హైదరాబాద్‌ వచ్చి ఆస్పత్రిలో చేరారని, మరుసటి రోజు శస్త్రచికిత్స అయినట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి కర్ణాటకు చెందిన లాయర్‌ రాజశేఖర్‌ (67), నర్సు కృపాలత (48) కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నట్లు తేలింది. ఆపరేషన్‌కు వెళ్లేముందే వీరు చెరో పాతిక లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. వీరు ఇచ్చిన రూ.50 లక్షల్లో కిడ్నీలు ఇచ్చిన ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఇద్దరికీ రూ.8 లక్షలు చెల్లించినట్లు విచారణలో గుర్తించారు. ఇక వీరికి సర్జరీ ఎవరు చేశారన్నది ఇంకా తేలాల్సివుంది. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు మహిళలను, లాయర్‌, నర్స్‌లను గాంధీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరితో మాట్లాడటానికి తమిళం, కన్నడం తెలిసిన ఓ పీజీ మెడికో సాయం తీసుకున్నారు. మరోవైపు, ఈ కేసులో సుమంత్‌తో పాటు.. మరో ఇద్దరు అరెస్టవ్వగా.. వారిని విచారించేందుకు రాచకొండ పోలీసు కమిషనర్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


సర్జరీ చేసింది ఎవరు?

ఈ శస్త్రచికిత్స వ్యవహారంలో సర్జరీ చేసింది ఎవరు అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. సర్జరీ చేసిన వైద్యబృందం ఢిల్లీ నుంచి వచ్చినట్లుగా కిడ్నీలు ఇచ్చిన మహిళలు చెబుతున్నారు. అలకనంద ఆస్పత్రి డాక్టర్‌ గుంటుపల్లి సుమంత్‌, డాక్టర్‌ సుదీప్‌ పేరిట రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా వీరిద్దరూ ఒకరు చైనాలో, మరొకరు రష్యాలో ఎంబీబీఎస్‌ చేసినట్లు సమాచారం. నిబంధనల మేరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను యూరాలజిస్టులు మాత్రమే చేయాలి. కానీ అలకనంద ఆస్పత్రి రికార్డుల్లో ప్లాస్టిక్‌ సర్జన్‌ పేరు ఉండటంతో అసలు సర్జరీ ఎవరు చేశారన్నది తేల్చలేకపోతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చాలా సీరియ్‌సగా ఉందని చెబుతున్నారు. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించినట్లు సమాచారం. అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారాన్ని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సుమోటోగా తీసుకుంది. బాఽధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పోలీసుల సహకారంతో ఎథికల్‌, మాల్‌ప్రాక్టీస్‌ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతామని వెల్లడించింది. అలకనంద కిడ్నీ రాకెట్‌ వెనుక కార్పొరేట్‌ ఆస్పత్రుల హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో సర్జరీ చేసి ఇక్కడ ఉంచారన్న సందేహాలను పలువురు యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

Updated Date - Jan 23 , 2025 | 04:38 AM