Political Clash: భువనగిరిలో ఉద్రిక్తత
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:52 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వివాదంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో రోజు ఆదివారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, ప్రతిగా శనివారం బీఆర్‌ఎస్ కార్యాలయంపై యువజన కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
పోలీసు నిఘాను ఛేదించి.. బీఆర్‌ఎస్ ధర్నా
మాజీ ఎమ్మెల్యే, పలువురు నేతల అరెస్టు
భువనగిరి టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వివాదంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో రోజు ఆదివారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, ప్రతిగా శనివారం బీఆర్‌ఎస్ కార్యాలయంపై యువజన కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిని ఖండిస్తూ ఆదివారం భువనగిరిలో బీఆర్‌ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసుల నిఘాను చేధించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో బీఆర్‌ఎస్ నాయకులు అకస్మాత్తుగా ధర్నాకు దిగారు. అదే సమయంలో వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అక్కడికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు బలవంతంగా తరలించారు.
ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి కాలికి గాయమైంది. మహాధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఘట్‌కేసర్‌లో అరెస్టు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎంను దూషించి శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కారణమైన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డితో పాటు బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి చేసిన యువజన కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. రామకృష్ణారెడ్డి ఉద్దేశపూర్వకంగానే సీఎం రేవంత్‌రెడ్డిని అసభ్యంగా దూషించి కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. రామకృష్ణా రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి, నాయకుల అరెస్టులు దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు.