AP Year Ender: 2022లో ఏపీలో చాలానే జరిగాయిగా.. కానీ ఆ ఒక్క వీడియోతో నివ్వెరపోయిన జనాలు..!

ABN , First Publish Date - 2022-12-28T17:57:40+05:30 IST

2022 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics 2022) కీలకమైన సంవత్సరం. మరీ ముఖ్యంగా 2022వ సంవత్సరం ఏపీలో (AP 2022) కొన్ని కీలక నిర్ణయాలకు, వివాదాలకు..

AP Year Ender: 2022లో ఏపీలో చాలానే జరిగాయిగా.. కానీ ఆ ఒక్క వీడియోతో నివ్వెరపోయిన జనాలు..!

2022 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics 2022) కీలకమైన సంవత్సరం. మరీ ముఖ్యంగా 2022వ సంవత్సరం ఏపీలో (AP 2022) కొన్ని కీలక నిర్ణయాలకు, వివాదాలకు వేదికైంది. వైసీపీ ప్రభుత్వం 2022లో (YCP Govt 2022) పాలనాపరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని నిర్ణయాలు సొంత పార్టీలోని ముఖ్యులతో పాటు ఏపీ ప్రజలను (AP People) కూడా నివ్వెరపోయేలా చేశాయి. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి విజయమ్మ (YS Vijayamma) తప్పుకోవడం, ఆ విషయాన్ని వెల్లడించడంలో జగన్ (Jagan) రాజకీయంగా అనుసరించిన చాకచక్య వైఖరి ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మంత్రివర్గ ఏర్పాటు 2022లో జగన్ పాలనాపరంగా తీసుకున్న కీలక నిర్ణయాలు. అయితే.. ఈ రెండు పరిణామాల సందర్భంలో జగన్‌కు తలనొప్పులు ఎదురయ్యాయి. మంత్రివర్గ కూర్పులో కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. జిల్లాల విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు, ఆందోళనలూ వ్యక్తమయ్యాయి. టీడీపీ మహానాడు సూపర్ సక్సెస్ కావడం కూడా అధికార వైసీపీని ఆందోళనలో పడేసింది. 2022 సంవత్సరాంతంలోనే టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్రకు ‘యువగళం’గా పేరు పెట్టారు. 2023, జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. ఇలా.. ఏపీలో 2022వ సంవత్సరంలో జరిగిన కీలక పరిణామాలపై ఓ లుక్కేయండి..

AP-Ministers.jpg

1. జగన్ కొత్త మంత్రివర్గం (Jagan Cabinet Reshuffle)

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 2022లో జరిగిన కీలక పరిణామం జగన్ కొత్త మంత్రివర్గ ఏర్పాటు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే రెండున్నరేళ్ల తర్వాత జగన్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు పూనుకోవడం వైసీపీలో కీలక పరిణామంగా చెప్పవచ్చు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కన్న బాబు, ఆళ్ల నాని వంటి వీర విధేయులకు జగన్ ఉద్వాసన పలకడం మంత్రి పదవులు కోల్పోయిన సదరు ఎమ్మెల్యేలకు కూడా షాకిచ్చిందనే చెప్పాలి. ఆ పరిణామం తర్వాత కొత్త మంత్రివర్గం ఖరారైంది. పూర్తిగా తన విచక్షణాధికారంపైన ఆధారపడిన మంత్రివర్గ కూర్పు కూడా ముఖ్యమంత్రి జగన్‌ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యలేకపోయారు.

సూటిగా చెప్పాలంటే... ‘బెదిరింపులు, హెచ్చరికలు, అలకలు, అసంతృప్తు’లకు లొంగిపోయారు. కేబినెట్‌ ప్రక్షాళన విషయంలో ‘క్విక్‌గన్‌.. జగన్‌’ చివరికి తుస్సుమనింది. గురి తప్పి.. 11 అడుగుల అవతల పేలింది. పాత మంత్రివర్గంలో మొత్తం అందరినీ తీసేస్తామని ప్రకటించి.. అందరితో రాజీనామాలు చేయించి.. ‘కొందరు మాత్రమే ఉంటారని’ నాలుక మడతేసి.. చివరికి ఏకంగా 11 మందిని మళ్లీ మంత్రులుగా తీసుకోవాల్సి వచ్చింది. రింగ్‌ మాస్టరే.. కొరడాను మడతపెట్టి, బెంచిపై నిల్చున్న పరిస్థితి కనిపించింది.

14 మంది ఇన్‌ (కొత్త మంత్రులు)

1) ధర్మాన ప్రసాదరావు, 2) పీడిక రాజన్నదొర, 3) గుడివాడ అమర్‌నాథ్‌, 4) బూడి ముత్యాలనాయుడు, 5) దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), 6) కారుమూరి వెంకట నాగేశ్వరరావు, 7) కొట్టు సత్యనారాయణ, 8) జోగి రమేశ్‌, 9) అంబటి రాంబాబు, 10) మేరుగ నాగార్జున, 11) విడదల రజని, 12) కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, 13) ఆర్‌.కె.రోజా, 14) ఉష శ్రీ చరణ్‌

13 మంది ఔట్‌ (తొలగించిన మంత్రులు)

1) ధర్మాన కృష్ణదాసు, 2) పుష్ప శ్రీవాణి, 3) అవంతి శ్రీనివాస్‌, 4) కురసాల కన్నబాబు, 5) ఆళ్ల నాని, 6) చెరుకువాడ శ్రీరంగనాథరాజు, 7) పేర్ని నాని, 8) కొడాలి నాని, 9) వెలంపల్లి శ్రీనివాస్‌, 10) మేకతోటి సుచరిత, 11) బాలినేని శ్రీనివాసరెడ్డి, 12) అనిల్‌ కుమార్‌ యాదవ్‌, 13) శంకరనారాయణ

11 మంది సేఫ్‌ (కొనసాగిస్తున్న పాత మంత్రులు)

1) సీదిరి అప్పలరాజు, 2) బొత్స సత్యనారాయణ, 3) పినిపే విశ్వరూప్‌, 4) చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 5) తానేటి వనిత, 6) ఆదిమూలపు సురేశ్‌, 7) అంజాద్‌ బాషా, 8) బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, 9)గుమ్మనూరు జయరాం, 10) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 11) కె.నారాయణస్వామి

Amaravati-Padayatra.jpg

2. అమరావతి రైతుల మహా పాదయాత్ర (Maha Pada Yatra)

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు రైతులు మహాపాద యాత్ర నిర్వహించడం 2022లో ఏపీలో జరిగిన మరో కీలక పరిణామం. అమరావతి ఉద్యమానికి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. అమరావతిలోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి యాత్రను ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమరావతి రైతులు పాదయాత్రకు కదిలారు. మొత్తం 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర మహా పాదయాత్ర చేసి దిగ్విజయంగా ముగించారు. అమరావతి నుంచి ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల గుండా శ్రీకాకుళంలోని అరసవల్లి వరకు యాత్ర కొనసాగింది. అమరావతి రైతుల పాదయాత్రకు జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా మొక్కవోని సంకల్పంతో పాదయాత్ర ముందుకెళ్లింది. పాదయాత్ర సాగిన ప్రతీ జిల్లాలో స్థానికులు గత ఏడాది ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట అమరావతి నుంచి తిరుమల తిరుపతి వరకు చేపట్టిన మహాపాదయాత్ర దిగ్విజయమైన సంగతి తెలిసిందే. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గుండా మొత్తం 400 కిలో మీటర్ల మేర యాత్ర సాగింది. అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకు సంబంధించినది కాదని, రాష్ట్ర ప్రజలందరిది అని చాటి చెప్పింది. అదే స్ఫూర్తితో మరో యాత్రకు బయల్దేరారు. రాష్ట్రంలో అధికార పార్టీ మినహా అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించాయి.

Mahanadu-2022.jpg

3. 2022 మహానాడుకే హైలైట్ ఏంటంటే.. (Mahanadu 2022)

2022లో టీడీపీ నిర్వహించిన మహానాడుకు అనూహ్య స్పందన వచ్చింది. జనం ఉప్పెనలా తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ కీలక నేతలంతా మహానాడు సక్సెస్ కావడంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పసుపు జెండా ఎగరడం ఖాయమని ధీమాగా ఉన్నారు. మహానాడుకు వచ్చిన స్పందన చూసి అధికార వైసీపీలో కూడా ఓటమి భయం పట్టుకుందని మహానాడు వేదికగా టీడీపీ నేతలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా ఇది అని చాటి చెప్పినట్టుగా మహానాడు సాగింది. ఈ మహానాడులో కొందరు యువ నేతలు కూడా తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో జోష్ నింపారు. అలాంటి యువ నేతలిచ్చిన స్పీచుల్లో కావలి గ్రీష్మ ప్రసాద్ ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వైసీపీ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి, కసికి రూపం అంటూ ఉంటే గ్రీష్మలానే ఉంటుందేమో అన్నట్టుగా మహానాడులో ఆమె ప్రసంగం సాగింది. గ్రీష్మ మైక్ అందుకుని మాట్లాడుతుంటే తెలుగు తమ్ముళ్లు ఈలలు, కేకలతో ఆమె ప్రసంగానికి జేజేలు పలికారు.

తొడగొట్టి మరీ వైసీపీకి ఆమె చేసిన హెచ్చరిక తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. ఉద్వేగంగా సాగిన ఆమె ప్రసంగానికి తెలుగు తమ్ముళ్లు ఫిదా అయ్యారు. గ్రీష్మ ప్రసంగం తెలుగు యువతను ఉర్రూతలూగించింది. అసలు ఎవరీ యువ మహిళా నేత అని చాలా మంది ఆ సందర్భంలో గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈమె మరెవరో కాదు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ సేవలందించిన సీనియర్ నేత కె.ప్రతిభా భారతి కుమార్తె. ఉమ్మడి ఏపీకి తొలి మహిళా స్పీకర్‌గా సేవలందించిన ప్రతిభా భారతి వారసురాలిగా గ్రీష్మ 2017లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజాం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గ్రీష్మ సమాయత్తమవుతున్నారు.

Atmakuru-By-Poll.jpg

4. ఆత్మకూరులో వైసీపీ గెలుపు-నెరవేరని జగన్ ఆశలు

2022 జూన్‌లో ఆత్మకూరు ఉప ఎన్నిక (Atmakuru By Poll) జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి (Vikram Reddy) 82,888 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇదిలా ఉండగా.. ఈ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి (BJP) 19,352 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు పోలయ్యాయి. ఇతరులకు 11,496 ఓట్లు, నోటాకు 4,179 ఓట్లు పోలవడం విశేషం. బీఎస్పీ అభ్యర్థి ఓబులేష్‌కు 4,897 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మేకపాటి కుటుంబం నుంచే అభ్యర్థిని ప్రకటించడంతో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. మొత్తంగా గమనిస్తే ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ గెలిచినప్పటికీ ఆశించిన మెజారిటీ సాధించలేకపోయింది. లక్ష మెజారిటీ కోసం మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలంతా ఆత్మకూరులోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం తగ్గడం వైసీపీ లక్ష మెజారిటీ ఆశలపై నీళ్లు చల్లింది.

Health-University.jpg

5. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు (Health University Name Change)

జగన్ సర్కార్ 2022లో తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు. ప్రజలు ఏమనుకున్నా, వారి డిమాండ్‌ ఎలా ఉన్నా, ఎన్ని రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసినా మేం చేసేది చేసేస్తాం అన్నట్టుగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంతమే నెగ్గించుకుంది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చేసింది. సెప్టెంబర్ 21న డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చారు. అప్పటికి రెండు రోజుల ముందే వర్సిటీ పేరు మార్పునకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వర్సిటీ పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకించారు. శాసనభలోనే సవరణ బిల్లును చించేశారు.

నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వం ఉభయ సభల్లో వర్సిటీ పేరు మార్పు బిల్లును ఆమోదించుకుంది. అక్టోబర్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ బిల్లును ఆమోదించి, ప్రభుత్వానికి పంపించారు. హెల్త్‌ యూనివర్సిటీ(Health University)తో వైఎస్‌కు ఎలాంటి సంబంధం, అనుబంధమూ లేదు. దీనిని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్‌. దీనికి గుర్తింపు తీసుకొచ్చిందీ ఎన్టీఆర్‌. ఇప్పుడు ఆయన పేరుకే వైసీపీ సర్కారు మంగళం పాడింది. జిల్లాల పునర్విభజన సమయంలో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ జిల్లా(NTR District)గా నామకరణం చేసింది. ఎన్టీఆర్‌ను టీడీపీ, చంద్రబాబు అలక్ష్యం చేశారని చెప్పింది. ఆయనంటే తమకు ఎంతో గౌరవమున్నట్లు గొప్పలు చెప్పుకొంది. ఒక చిన్న జిల్లాకు ఆయన పేరుపెట్టి.. ప్రతిష్ఠాత్మక హెల్త్‌ యూనివర్సిటీ నుంచి ఆయన పేరును దూరం చేసింది.

Vijayamma-YS.jpg

6. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా (YS Vijayamma Resignation)

2022లో వైసీపీలో అంతర్గతంగా జరిగిన కీలక పరిణామం విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవడం. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమెను పార్టీ నుంచి తరిమేయడానికి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారని, తెలంగాణలో సోదరి షర్మిల పార్టీని సాకుగా చూపించి ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించనున్నారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ కథనంలో చెప్పిందే నిజమైంది. వైసీపీ ప్లీనరీ వేదికగా విజయమ్మ వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్లీనరీలో తొలుత జగన్‌ మాట్లాడారు. ఆ తర్వాత విజయలక్ష్మి ప్రసంగించారు. ఆమె సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా తడబాటులేదు. పేపర్‌చూసి మాట్లాడింది లేదు. సూటిగా సభికులను చూస్తూ తన మనసుకు తోచింది మాట్లాడారు. పైగా తన మసనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానని చెప్పారు.

ప్రసంగం చివరిలో ఆమె తన కుటుంబ బాధ్యతల ప్రస్తావన తెస్తున్న సమయంలో.. వేదికపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘మా కుటుంబం చాలా గొప్పది’ అని ఆమె అంటుండగానే వెనుక నుంచి ఎవరో పిలిచారు. ప్రసంగం ఆపి వెనక్కి తిరిగి వారితో ఆమె మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కసారిగా సభ సైలెంట్‌ అయిపోయింది. ఆమె తన ప్రసంగం కూడా ఆపేశారు. పక్కన వారు చెప్పింది విన్నాక చేతిలోకి పేపర్‌ తీసుకొని మళ్లీ పోడియం ముందు నిల్చున్నారు. అయితే,ఇది జరుగుతున్నప్పుడు జగన్‌ మీడియా తమ ప్రత్యక్ష ప్రసారాన్ని పక్కకు మళ్లించింది. అప్పటి వరకు ఆమెపై ఫోక్‌సపెట్టిన కెమెరాను జగన్‌ మీదకు మళ్లించారు. విజయలక్ష్మి ప్రసంగం అందుకున్న తర్వాత మళ్లీ కెమెరాను ఆమెపైకి తెచ్చారు. ఈ పరిణామానికి ముందువరకు ధాటిగా, అనర్గళంగా మాట్లాడిన విజయలక్ష్మి మాట.. ఆ తర్వాత బొంగురుపోయింది. తీవ్ర ఉద్విగ్నతకు లోనయినట్లుగా ఆమె ముఖ కవళికలు మారిపోయాయి. మాటల్లో ఆవేదన, ఆందోళన ప్రస్ఫుటంగా కనిపించాయి.

AP-New-Districts.jpg

7. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts)

2022వ సంవత్సరంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక కీలక పరిణామం. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ పేరుతో జగన్ సర్కార్ అప్పటి వరకూ ఏపీలో ఉన్న 13 జిల్లాలను మొత్తం 26 జిల్లాలకు వైసీపీ ప్రభుత్వం పెంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన 23 రెవెన్యూ డివిజన్లతో కలిపి మొత్తం ఏపీలో 73 రెవెన్యూ డివిజన్లయ్యాయి. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రకాశం జిల్లా అత్యంత పెద్ద జిల్లాగా అవతరించింది. ఇది 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాష్ట్రంలో పెద్ద జిల్లాగా అవతరించగా.. విశాఖపట్నం అత్యంత చిన్నజిల్లాగా మారింది.

పాత విశాఖపట్నం జిల్లా మూడు ముక్కలైంది. పాత విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను అనకాపల్లి జిల్లాగా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేశారు. కేవలం నగర ప్రాంతంతో విశాఖపట్నం జిల్లా మిగిలింది. దీని విస్తీర్ణం 928 చదరపు కిలోమీటర్లుగా ఉంది. భౌగోళికంగా చిన్నదైన ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేకపోవడం మరో విశేషం. ఈ జిల్లా జనాభా మొత్తం 18.13 లక్షలు. మరోవైపు.. అత్యధిక జనాభా ఉన్న జిల్లా కర్నూలు. ఈ జిల్లాలో 23.66 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా అత్యంత తక్కువ జనాభా (9.54 లక్షలు) ఉన్నది అల్లూరి సీతారామరాజు జిల్లా.

ఏపీలోని 26 జిల్లాలు ఇవే..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు.

Gorantla-Madhav-Video.jpg

8. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కలకలం

( YSRCP MP Gorantla Madhav Video Viral)

2022లో ఏపీకే మాయని మచ్చగా మిగిలిన వ్యవహారం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఒక మహిళతో మాట్లాడిన వీడియో. ఈ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేసింది. ఓ రేంజ్‌లో ‘వైరల్‌’ అయింది. ఈ వీడియోలో గోరంట్ల మాధవ్‌ పూర్తి నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పార్లమెంట్ సమావేశాల సమయం కావడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. జాతీయ చానళ్లలో కూడా గోరంట్ల ‘నగ్న’ కథనాలు ప్రసారమయ్యాయి. జగన్ వైసీపీకి కనీసం ఎంపీ పదవికి అయినా మాధవ్‌తో రాజీనామా చేయిస్తారని అంతా భావించారు. కానీ.. ఇప్పటికీ మాధవ్ ఎంపీగా వైసీపీలోనే కొనసాగుతుండటం కొసమెరుపు.

Ippatam-Village.jpg

9. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత ( Ippatam House Demolition)

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజవర్గంలోని ఇప్పటం అనే గ్రామంలో రహదారి విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేత 2022లో ఏపీలో జరిగిన మరో కీలక పరిణామం. ఇప్పటం గ్రామంలో మెజారిటీ కాపు సామాజికవర్గానిదే. జనసేన ఆవిర్భావ సభకు ప్రభుత్వ ఆంక్షల కారణంగా భూములు దొరకని సందర్భంలో ఆ ఊరి రైతులు ముందుకొచ్చి 13 ఎకరాల భూమి ఇచ్చారు. సభ నిర్వహణకు సహకరించారు. అంతేకాదు.. గ్రామంలో చెరువు మట్టిని ఎడాపెడా తవ్వేసి రూ.లక్షలకు అమ్ముకున్న వైసీపీ నాయకులను లెక్కలు అడిగారు. అంతే.. అధికార పార్టీ నేతలు ఆ గ్రామంపై కక్ష గట్టారు. ఆక్రమణల తొలగింపు అంటూ ఎక్స్‌కవేటర్లతో వచ్చి విశాలమైన రోడ్డు వెంబడి ఉన్న నివాసాలను దౌర్జన్యంగా కూల్చేసి విధ్వంసం సృష్టించారు. ఈ విధ్వంసంపై జనసేనాని పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. ఇప్పటంలో గత మార్చిలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించడంతో ఈ గ్రామం పేరు రాష్ట్రమంతటా మార్మోగిపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది.

పెదవడ్లపూడి శివాలయం సెంటరు నుంచి ఇప్పటం, వడ్డేశ్వరం మీదగా పంచాయతీరాజ్‌ రోడ్డు వెళ్లి కుంచనపల్లి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిని కలుస్తుంది. ఈ రోడ్డు మొత్తం 8.9 కిలోమీటర్లు పొడవు. వీజీటీఎం ఉడా మాస్టర్‌ ప్లాన్‌లో ఈ రహదారిని 60 అడుగుల రోడ్డుగా విస్తరించాలని ప్రతిపాదించారు. కానీ ఆ రోడ్డు 60 అడుగుల వెడల్పు ఉంది. అయినా జనసేన ఆవిర్భావసభకు ఇప్పటం రైతులు సహకరించడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వపెద్దలు.. అధికారాన్ని అడ్డపెట్టుకుని ఆక్రమణల తొలగింపు పేరుతో గ్రామం మీదకు దండెత్తారు. ఏప్రిల్లో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులతో గ్రామంలోని రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాల తాలూకు సుమారు 50 మందికిపైగా ఆక్రమణల్లో ఉన్నారంటూ నోటీసులు ఇప్పించారు.

Chalo-Vijayawada.jpg

10. ‘చలో విజయవాడ’కు ఉప్పెనలా తరలివెళ్లిన ఉద్యోగులు ('Chalo Vijayawada' Super Success)

పీఆర్సీ ఉద్యమ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ‘చలో విజయవాడ’ అటు సర్కారు, ఇటు స్వయంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఊహించని రీతిలో విజయవంతమైంది. అప్పుడెప్పుడో ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ ఉక్కుపాదాల కింద ఉద్యోగులు తిరగబడ్డారు. ఆ తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ స్థాయిలో ఉద్యమించడం బహుశా ఇదే తొలిసారి. ‘వారు బల ప్రదర్శన చేయాలనుకుంటున్నారు’ అని ప్రభుత్వ పెద్దలు ఆక్షేపించగా.. ఉద్యోగులు నిజంగానే బలమేమిటో చూపారు. పిడికిళ్లు బిగించి నినదిస్తూ తరలి వచ్చిన వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను అడ్డుకోవడం కుదరదని పోలీసులు గ్రహించారు. బారికేడ్లను పక్కకు తీసి.. ‘ప్రవాహానికి’ దారి విడిచారు. దీంతో.. ‘చలో విజయవాడ’ ప్రశాంతంగా ముగిసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు. బెజవాడ వైపు వచ్చే వాహనాలను పలు చోట్ల ఆపి తనిఖీ చేసి.. ఉద్యోగ, ఉపాధ్యాయులను కిందికి దించేశారు. బెజవాడకు చేరుకునే వారి సంఖ్య మూడంకెల్లోనే ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ.. వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

Lokesh-Yuva-Galam.jpg

11. లోకేష్ పాదయాత్రకు ‘యువ గళం’గా నామకరణం

( TDP Nara Lokesh PadaYatra Named Yuvagalam)

టీడీపీ యువ నేత నారా లోకేష్ ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నారు. 2023 జనవరి 27న మొదలుకానున్న ఈ పాదయాత్రకు ‘యువ గళం’గా పేరు పెట్టినట్టు డిసెంబర్ 28న ప్రకటించారు. టీడీపీ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. లోకే‌ష్ పాదయాత్ర 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు సాగనుంది. వైసీపీ సర్కార్ చేస్తున్న అన్యాయాలను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతకు చేస్తున్న ద్రోహాన్ని టీడీపీ యువనేత తన పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నారు. కుప్పం నుంచి మొదలై ఇచ్ఛాపురంతో లోకేష్ పాదయాత్ర ముగియనుంది.

Updated Date - 2022-12-28T18:47:49+05:30 IST