Ramakrishna: ఎగ్జామ్స్ దగ్గరపడుతుంటే టీచర్ల బదిలీలేంటి?

ABN , First Publish Date - 2022-12-15T14:24:16+05:30 IST

10వ తరగతి పరీక్షలు (10th Class Exams) దగ్గర పడుతుంటే బదిలీలు ఎలా చేస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ

Ramakrishna: ఎగ్జామ్స్ దగ్గరపడుతుంటే టీచర్ల బదిలీలేంటి?
ఎగ్జామ్స్ దగ్గరపడుతుంటే టీచర్ల బదిలీలేంటి?

అమరావతి: 10వ తరగతి పరీక్షలు (10th Class Exams) దగ్గర పడుతుంటే బదిలీలు ఎలా చేస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ (Ex MLC AS Ramakrishna) ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జీవో నెం.180 ద్వారా ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల(teachers Transfers)కు రంగం సిద్ధం చేసింది. కాలం కాని కాలంలో విత్తనాలు నాటితే ఎలాగైతే పంట పండదో.. ఇప్పుడు ఉపాధ్యాయ బదిలీలతో ప్రభుత్వం సాధించేది కూడా శూన్యం. ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టడానికి, పని భారం పెంచడానికే ప్రభుత్వం బదిలీల పేరుతో వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది చాలక ఉపాధ్యాయులపై కక్ష కడతారా? ప్రభుత్వం బదిలీలపై సరైన, హేతుబద్ధమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతోంది? జీవో నెం.117తో 4 లక్షల మందిని విద్యకు దూరం చేసిన ప్రభుత్వం, జీవోనెం.180తో 25వేల ఎస్జీటీ పోస్టులకు మంగళం పాడుతోంది. పోయిన ఏడాది ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులు బదిలీల పేరుతో తమను స్థానచలనం చేయడంపై కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారన్న ఆగ్రహంతో జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించినవారికి నోటీసులు ఇచ్చింది. కోర్టుకు వెళ్లినవారిని ఇబ్బంది పెట్టేందుకే.. బదిలీలతో మిగిలినవారిని కూడా బలి చేయడానికి సిద్ధమైంది. ఉపాధ్యాయులంతా తమకు జీహూజూర్ అనాలన్నదే పాలకుల ఉద్దేశమా? ప్రభుత్వం చేపట్టే బదిలీల వల్ల ఉన్న ఉపాధ్యాయులు పోవడమే కాకుండా సబ్జెక్ట్‌లకు సరిపడా టీచర్లు లేకుండా పోతారు.’’ అని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-15T14:31:10+05:30 IST