Congress twitter: కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్స్ బ్లాక్ చేయండి.. కోర్ట్ ఆదేశాలు..
ABN , First Publish Date - 2022-11-08T16:00:50+05:30 IST
కాంగ్రెస్ పార్టీ (Congress), భారత్ జోడో యాత్రల (Bharat Jodo Yatra) ట్విటర్ ఖాతాలను (Twitter) తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ బెంగళూరులోని కమర్షియల్ కోర్టు ఆదేశాలిచ్చింది.
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ (Congress), భారత్ జోడో యాత్రల (Bharat Jodo Yatra) ట్విటర్ ఖాతాలను (Twitter) తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ బెంగళూరులోని కమర్షియల్ కోర్టు ఆదేశాలిచ్చింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ రూపొందించిన పాటలకు కేజీఎఫ్-2 చాప్టర్‌లోని (kgf2 song) పాటల మ్యూజిక్‌ను కాపీ కొట్టారంటూ ఎంఆర్‌టీ మ్యూజిక్ (MTR Music) కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన అనంతరం 85వ అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్ట్ జడ్జి లతా కుమారి ఈ మధ్యంతర ఉత్తర్వలను జారీ చేశారు. ట్విటర్ ఖాతాలను నిలుపుదల చేయాలంటూ ట్విటర్‌ను జడ్జి ఆదేశించారు.
కాంగ్రెస్ అప్‌లోడ్ చేసిన పాట, సినిమాలోని ఒరిజినల్ మ్యూజిక్ తమకు సీడీల రూపంలో అందాయని, వాటిని పరిశీలించామని జడ్జి లతా కుమారి చెప్పారు. ఎంటీఆర్ కంపెనీ లేబుల్‌ను (Label) మార్చినట్టు స్పష్టమైందని, ఈ తరహా ఉల్లంఘన ఐటీ చట్టం (IT Act)లోని సెక్షన్ 79 కిందకు వస్తుందని తెలిపారు. కాపీ రైట్స్ ఉల్లంఘనలకు సంబంధించిన మూడు వీడియో లింకులను కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర ట్విటర్ హ్యాండిల్స్ నుంచి తొలగించాలని జడ్జి స్పష్టం చేశారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత ఇలాంటివాటిని ప్రోత్సహిస్తే సినిమాలు, పాటలు, మ్యూజిక్ అల్బమ్స్ హక్కులు దక్కించుకునే కంపెనీలకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. పైరసీని కూడా ప్రోత్సహించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్స్‌ను నిలుపుదల చేయాలని ట్విటర్‌కు సూచించారు. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 21, 2022కి వాయిదా వేస్తున్నట్టు జడ్జి వెల్లడించారు. కాపీ ఉల్లంఘనకు సంబంధించి ఎంటీఆర్ కంపెనీ సమర్పించిన ఆధారాలను టెక్నికల్ టీమ్స్ పరిశీలించాల్సి ఉంటుంది.
కాగా రాహుల్ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న సమయంలో కేజీఎఫ్2 లోని ఓ సూపర్ హిట్ సాంగ్‌ను వాడారని ఎంటీఆర్ మ్యూజిక్ కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రతివాదులుగా కాంగ్రెస్ పార్టీ (INC), రాహుల్ గాంధీ (Rahul Gandhi), పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినటే (Supriya Shrinate) పేర్లను పేర్కొన్నారు. కేజీఎఫ్2 హిందీ హక్కులు దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశామని మ్యూజిక్ కంపెనీ తన పిటిషన్‌లో వెల్లడించింది.
కాంగ్రెస్ స్పందన...
బెంగళూరు కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా స్పందించింది. బెంగళూరు కోర్టు ఆదేశాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నామని, కోర్టు ప్రొసీడింగ్స్‌పై తమకు అవగాహనలేదని సోమవారం తెలిపింది. చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్టు, న్యాయపరంగా ముందుకెళ్తామని వెల్లడించింది. కాగా రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర సోమవారం తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.