Gujarat Assembly Election 2022: మోదీ, షాలకు అగ్ని పరీక్ష!
ABN , First Publish Date - 2022-11-04T19:19:46+05:30 IST
గాంధీనగర్: డిసెంబర్ 1, 5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election)లో బీజేపీని తిరిగి గెలిపించుకోవడం...
గాంధీనగర్: డిసెంబర్ 1, 5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election)లో బీజేపీని తిరిగి గెలిపించుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(prime minister narendra modi)కి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(central home minister amit shah)లకు అగ్ని పరీక్ష కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ప్రతిపక్షాలకు సరైన సంకేతాలు పంపినట్లు అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. వరుసగా ఆరు సార్లు గెలిచిన బీజేపీని ఏడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇద్దరు నేతలూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవలే వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తపడ్డారు.
ఏడోసారి అధికారంలోకి రావడం సవాలే!
ఏడోసారి అధికారంలోకి రావడం అనేది ఏ పార్టీకైనా సవాలేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం కలిగించకుంటే ఓట్లు పొందడం కష్టమేనంటున్నారు. ప్రజావ్యతిరేకత తలెత్తకుండా చూసుకునేందుకే అధికార బీజేపీ ఇటీవల పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని పరిశీలకులు చెబుతున్నారు. నరేంద్ర-భూపేంద్ర కాంబినేషన్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కమలనాథులు ప్రజలకు నచ్చచెబుతున్నారు.
గెలిపించే బాధ్యత మోదీ, షాలదే!
గుజరాత్‌లో బీజేపీని గెలిపించే బాధ్యత గతంలో మాదిరిగానే మోదీ తీసుకున్నారు. ఈ సారి షా కూడా తోడయ్యారు. ఇప్పటికే పలు మార్లు గుజరాత్‌లో పర్యటించిన ఈ ఇద్దరు నేతలు ఎన్నికల లోపు అనేకసార్లు ప్రచార సభల్లో పాల్గొన్నారు. క్యాడర్‌ను మరోసారి ఉత్సాహపరిచే బాధ్యత వీరే తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా గుజరాత్‌లో పార్టీని గెలిపించే బాధ్యత మోదీ-షాలే తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో భూపేంద్రను తిరిగి సీఎం చేయాల్సిన బాధ్యత కూడా ఈ ఇద్దరు అగ్రనేతలదే. 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంటోన్న కమలనాథులు ప్రస్తుతం గుజరాత్‌లో గెలవడం ద్వారా ఊపు కొనసాగించాలని భావిస్తున్నారు. గుజరాత్‌లో ఫలితం తేడా వస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విరుచుకుపడే అవకాశం ఉంటుంది. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను మోదీ-షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హిందుత్వ, అభివృద్ధి సహా ఏ అంశాన్ని వదలకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈ సారి వందకు తగ్గకుండా ఫలితాలు రాబట్టుకోవాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
సవాలు విసురుతున్న ఆప్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ యోచిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ ఫలితాల ఊపుతో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో దూసుకుపోయేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నోట్లపై హిందూ దేవతల చిత్రాలను ప్రచురించాలని డిమాండ్ చేయడం ద్వారా కేజ్రీవాల్ హిందుత్వ కార్డ్ ఉపయోగించారు. బీజేపీ కన్నా దూకుడుగా హిందుత్వ అంశాన్ని ప్రదర్శిస్తున్నారు.
డీలా పడిన కాంగ్రెస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలతో బీజేపీకి దడ పుట్టించిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ప్రచారంలోనూ డీలా పడింది. అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తలమునకలై ఉన్నారు. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలోకి ఎంటరైంది. ఆయన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ డీలా పడటంతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించేందుకు అవకాశం చిక్కుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ ఒకటి, ఐదు తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు అదే నెల 8వ తేదీన విడుదల అవుతాయి.