Gujarat Assembly Elections: మోదీకి గెహ్లాట్ చురకలు

ABN , First Publish Date - 2022-11-25T19:33:01+05:30 IST

ప్రధానికి గుజరాత్‌లో ప్రచారం చేయాల్సిన అవసరమేంటి అని గెహ్లాట్ ప్రశ్నించారు.

 Gujarat Assembly Elections: మోదీకి గెహ్లాట్ చురకలు
Gehlot, Modi

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శలు చేశారు. తన సమయాన్నంతా ప్రధాని గుజరాత్‌కి మాత్రమే ఇస్తున్నారని, ప్రధానికి గుజరాత్‌లో ప్రచారం చేయాల్సిన అవసరమేంటి అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం కనపడుతున్న అభివృద్ధి అంతా కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని, ఆర్ధిక స్వాతంత్ర్యం లభించాకే మోదీ ప్రధాని అయ్యారని గెహ్లాట్ చెప్పారు. మాటికీ కాంగ్రెస్‌ను బద్నాం చేయడం మానుకోవాలన్నారు. ప్రధాని కాంగ్రెస్‌ను అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారని గెహ్లాట్ ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న గెహ్లాట్ అహ్మదాబాద్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామంటున్న కాంగ్రెస్‌ను విమర్శించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే తాపత్రయంతో పాటు విభజించి పాలించు అనే సూత్రం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి తెలుసంటూ మోదీ ధ్వజమెత్తారు. అంతేకాదు రాజస్థాన్‌ కాంగ్రెస్ ప్రభుత్వంపైనా మోదీ చురకలు వేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పాలనలో కనీసం ఒక్క మంచి వార్తయినా వింటున్నారా అని బహిరంగ సభ వేదికపై నుంచి ఓటర్లను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎప్పటికీ అభివృద్ధి చేయలేదని మోదీ తేల్చి చెప్పారు.

తన ప్రభుత్వంపై ప్రధాని మోదీ నిన్న విమర్శలు చేయడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేడు ప్రతి విమర్శలు చేశారు. నిజానికి రెండు వారాల క్రితం మోదీ, గెహ్లాట్ ఒకే వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా గెహ్లాట్‌ను మోదీ ప్రశంసించారు. వేదికపైన ఉన్న ముఖ్యమంత్రుల్లో గెహ్లాట్ సీనియర్ మోస్ట్ అని మోదీ పొగిడారు. మోదీ పొగడ్తల తర్వాతే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారంటూ సచిన్ పైలట్ కలకలం రేపారు కూడా. ఇలా ఉండగా మోదీని ఘాటుగా విమర్శించి తాను ఆయన ట్రాప్‌లో పడలేదని గెహ్లాట్ చెప్పాలనుకుంటున్నారని పరిశీలకులంటున్నారు.

Updated Date - 2022-11-25T19:33:03+05:30 IST