Gujarat Polls : గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే

ABN , First Publish Date - 2022-11-15T17:17:06+05:30 IST

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను

Gujarat Polls : గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే
Sonia Gandhi, Mallikharjun Kharge

గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఉన్నారు. సీనియర్లు, యువ నేతలకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాఘెల్ (ఛత్తీస్‌గఢ్), యువ నేతలు జిగ్నేష్ మేవానీ, సచిన్ పైలట్, కన్నయ్య కుమార్ కూడా స్టార్ కాంపెయినర్లుగా గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ల సొంత రాష్ట్రంలో బీజేపీ (BJP)ని ఓడించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ ఈ రాష్ట్రంలో దాదాపు 27 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఐదుగురు జోనల్ పరిశీలకులను, 32 మంది పరిశీలకులను కాంగ్రెస్ (Congress) సోమవారం నియమించింది. రాష్ట్రంలోని 32 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క పరిశీలకుడిని నియమించింది.

సూరత్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మండలంలో ఎన్నికలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పరిశీలిస్తారు. సౌరాష్ట్ర మండలంలో జరిగే ఎన్నికలను ఆ పార్టీ సీనియర్ నేత మోహన్ ప్రకాష్ పర్యవేక్షిస్తారు.

ఈ ఎన్నికలు (Gujarat Assembly Elections) డిసెంబరు 1, 5 తేదీల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన డిసెంబరు 8న జరుగుతాయి.

Updated Date - 2022-11-15T17:17:12+05:30 IST