K G Kannabiran: మీరు రాజీనామా చేయడానికి సిద్ధమేనా..? ఏకంగా జడ్జినే సవాల్ చేసిన లాయర్ కన్నబిరాన్

ABN , First Publish Date - 2022-12-30T14:55:31+05:30 IST

"జడ్జిగారూ! న్యాయమూర్తిగా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారా?" ఖంగుమన్న ఆయన గొంతుకు జడ్జితో పాటు యావత్ కోర్టు హాలు స్థాణువై నిశ్శబ్దమయ్యింది. "మీ మాటలు కోర్టు ధిక్కారమని మీకు అర్థమౌతోందా?" తేరుకున్న జడ్జి ఆ న్యాయవాది వైపు చూసి ఉరిమారు.

K G Kannabiran: మీరు రాజీనామా చేయడానికి సిద్ధమేనా..? ఏకంగా జడ్జినే సవాల్ చేసిన లాయర్ కన్నబిరాన్

"జడ్జిగారూ! న్యాయమూర్తిగా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారా?"

ఖంగుమన్న ఆయన గొంతుకు జడ్జితో పాటు యావత్ కోర్టు హాలు స్థాణువై నిశ్శబ్దమయ్యింది.

"మీ మాటలు కోర్టు ధిక్కారమని మీకు అర్థమౌతోందా?" తేరుకున్న జడ్జి ఆ న్యాయవాది వైపు చూసి ఉరిమారు.

జడ్జిలకి గట్టిగా అప్పీల్ చేసేందుకే న్యాయవాదులు గడగడలాడే వాతావరణంలో కిక్కిరిసిన ఒక కోర్టుహాలు దద్దరిల్లేలా జడ్జిని పదవికి తగడని దిగిపొమ్మని సవాల్ చేసిన న్యాయవాది మరెవరో కాదు, మానవ హక్కుల పోరాట యోధుడిగా పోరొందిన కన్నబిరాన్ గా పేరొందిన కందాడై గోపాలసామి కన్నబిరాన్ (K G Kannabiran).

అది 1994- చెన్నై టాడా (Terrorist and Disruptive Activities (Prevention) Act - TADA) కోర్టు హాలు. మధురైలో ఆరెస్సెస్ భవనం పేల్చివేత కేసు (RSS Bomb Blast case) విచారణ జరుగుతున్నప్పుడు, ముద్దాయిల తరఫున కేసు వాదిస్తున్న కన్నబిరాన్, న్యాయమూర్తి అర్హతని బాహాటంగా ప్రశ్నించడం సంచలనమయ్యింది. ఆరెస్సెస్ భవనం పేల్చివేత ఆరోపణలతో టాడా చట్టం కింద అరెస్టయిన ముస్లిం యువకుల తరఫున కన్నబిరాన్ వాదించారు. టాడా చట్టం ప్రకారం ముద్దాయిల వాఙ్మూలాన్ని ఒక సాక్ష్యంగా కోర్టు పరిగణించవచ్చు. దాన్ని కన్నబిరాన్ సవాల్ చేశారు. ముద్దాయిల్ని కొట్టి, భయపెట్టి పోలీసులు చెప్పించే వాఙ్మూలం చెల్లదని ఆయన వాదించారు. రాజ్యాంగం కల్పించే న్యాయబద్ధమైన విచారణ హక్కు, జీవించే హక్కులకి టాడా విచారణ పద్ధతులు గొడ్డలిపెట్టు అన్నారు. ముద్దాయిల తరఫున వాదనలు వినడానికి నిరాకరించడం రాజ్యాంగ ధిక్కరణ కింద వస్తుందని జడ్జితో వాదించి, తన ఆర్గ్యూమెంట్ వినేలా చేసుకున్నారాయన.

జాతివిద్రోహక శక్తులుగా ముద్రవేయబడుతున్న ముస్లిం వర్గం నుంచి కొందరి మీద కేసులు బనాయించడం, బెదిరించి, హింసించి చెప్పించిన వాఙ్మూలాల ఆధారంగా న్యాయవిచారణ జరగడం రాజ్యాంగ విరుద్ధమనే కన్నబిరాన్ వాదన. 1994లో ఆయన వినిపించిన ఆ వాదన- ఆ తర్వాత 16 ఏళ్లకి గాని ఆమోదం పొందలేదు. 2010 డిసెంబర్ 10న ఆ కేసు మీద తీర్పు ప్రకటించిన సుప్రిం కోర్టు ముద్దాయిలైన ముస్లిం యువకులను నిర్తోషులుగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పోలీసులకి ముద్దాయిలు ఇచ్చిన వాఙ్మూలం మీద ఆధారపడి వారిని నిందితులుగా నిర్ధారించలేమని కేసును కొట్టేయడం ద్వారా కన్నబిరాన్ వాదన గెలిచింది.

News-2.jpg

ఎందరో కన్నబిరాన్ ల అవసరం ఉందిప్పుడు: జస్టిస్ చంద్రు

సూర్య హీరోగా వచ్చిన 'జై భీమ్' సినిమాకు ప్రేరణ అయిన జస్టిస్ చంద్రుకి కన్నబిరాన్ అంటే హీరో వర్షిప్. 2020లో కన్నబిరాన్ పదవ వర్ధంతి సందర్భంగా ఒక స్మారక ఉపన్యాసం చేసిన చంద్రు, మానవహక్కుల ఉల్లంఘనలు పెచ్చరిల్లిపోయిన నేటి పరిస్థితుల్లో కన్నబిరాన్ వంటి మానవహక్కుల యోధుల అవసరం ఇప్పుడు ఇంకా అవసరముందని అన్నారు. 'కేజీకే (KGK)' గా తాను ఆత్మీయంగా పిలుచుకునే కన్నబిరాన్ - అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా విధించిన ఎమర్జెన్సీ (The Emergency in India) 1975-77 మధ్యకాలంలో అహర్నిశలూ ఖైదీల విడుదల కోసం హెబియస్ కార్పస్ రిట్ పిటీషన్లు వేసి వాదించిన సంగతులను ఆయన తలుచుకున్నారు.

ఎమర్జెన్సీలో ఏకాంగవీరుఁడు

కన్నబిరాన్ ఆత్మకథనాత్మక గ్రంథం 'The Speaking Constitution' లో నాటి ఎమర్జన్సీ దమనకాండ గురించిన వివరాలు ఎన్నో ఉన్నాయి. న్యాయస్థానాల్లో జడ్జిలు అందరూ ఇందిరా గాంధీ విధించిన అత్యయిక పరిస్థితికి అనుకూలంగానే ఎలా వ్యవహరించారో రాసుకొచ్చారు కన్నబిరాన్ తన పుస్తకంలో.

"ఒక పిల్లవాడ్ని నడిరోడ్డులో పోలీసులు కాల్చి చంపారని మీరు పిటీషన్ వేసినంత మాత్రాన, దాన్ని అడ్మిట్ చేసుకోవడం కుదరదు..." అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రారెడ్డి అన్నారు. హైకోర్టు ఫుల్ బెంచ్ లో భాగమైన జస్టిస్ రామచంద్రారెడ్డి అలా వ్యాఖ్యానించడం బట్టి అప్పటి వ్యవస్థల పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా అయ్యాయో తన పుస్తకంలో చెప్పుకొచ్చారు కన్నబిరాన్. ఎమర్జన్సీ కాలంలో జీవించే హక్కు (right to life) కూడా కాలరాయబడటం సహించలేని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హె ఆర్ ఖన్నా నిరసనగా తన పదవికి రాజీనామా చేశారట. జైళ్లలో బంధించిన వారిని కన్నబిడ్డలుగా లాలనతో చూసుకుంటుందని ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తే, ఎమర్జెన్సీ ప్రభుత్వం మీద తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని అప్పటి ప్రధాన న్యాయమూర్తి వై వి చంద్రచూడ్ (Y V Chandrachud - ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ -Dhananjaya Y. Chandrachud తండ్రి) ప్రకటించారు. అటువంటి రోజుల్లో నిరసనతో రాజీనామా చేసిన జస్టిస్ ఖన్నా వంటి నిజాయితీపరుడ్ని తాను చూడలేదని అంటారు కన్నబిరాన్ తన పుస్తకంలో.

ఎమర్జెన్సీ నాటి 21 నెలలూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులకు ఆయన వేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటీషన్ల విచారణ తప్ప మరిక వేరే కేసులు లేవు. వామపక్షవాదులు, వారి సానుభూతిపరుల కేసులే కాదు, జైళ్లలో నిర్బంధించబడ్డ జెమాతె ఇ ఇస్లామీ, ఇంకా ఆరెస్సెస్ వాళ్లు కూడా ఆయన క్లయింట్లే. అప్పటి జనసంఘ్ నేత, తర్వాత బీజేపీ నాయకుడై, సిక్కిం గవర్నర్ గా చేసిన, వీ రామారావు ఆయన క్లయింట్సులో ఒకరు.

News-3.jpg

ఎమర్జెన్సీలో కన్నబిరాన్ వేసిన చివరి రిట్ పిటీషన్ - జైలులో నిర్బంధించబడ్డ ఓ పదిహేనేళ్ల కుర్రాడి తరఫున. తర్వాత కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ నాయకుడిగా ఎదిగిన భవానీ శంకరుడు అనే ఆ పిల్లవాడిని కోర్టు బోను ఎక్కించినప్పుడు, 'నీ లాయర్ ఎవరు...' అని అడిగారట జడ్జి. 'కన్నబిరాన్ ' అని తడుముకోకుండా ఆ పిల్లవాడు చెప్పినప్పుడు కన్నబిరాన్ కోసం కబురుచేశారట.

ఒక హెబియస్ కార్పస్ పిటీషన్ మీద వాదించి బైట రిలాక్సవుతున్న కన్నబిరాన్ కి కబురెళ్లిందట. ఆయన కోర్టు హాల్లోకి వచ్చి, నూనూగు మీసమైనా రాని భవానీ శంకరుడు వంక చూసి, “ఈ కుర్రవాడి వల్ల దేశ అంతర్గత భద్రతకి ముప్పు వాటిల్లే పనైతే, అసలు ఆ మీసా ( Maintenance of Internal Security Act- MISA) చట్టమే పరమ పనికిమాలినది,” అన్నారట కన్నబిరాన్. సుప్రీం కోర్టు ఆమోదించిన మీసా చట్టం గురించి అలా మాట్లాడగలిగిన నిర్భయుడు కన్నభిరాన్ ఒక్కరే.

ఆంధ్రప్రదేశులో విప్లవ రచయితల మీద బనాయించబడ్డ కుట్రకేసులు, కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసు, పార్లమెంటు భవనం మిద దాడి కేసు, వీరప్పన్ అనుచరుల మీద టాడా కేసుల్లో డిఫెన్స్ లాయర్ గా, చత్తీస్ ఘడ్ లో ప్రముఖ కార్మిమ నాయకుడు శంకర్ గుహ నియోగి హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా - ఇలా కాశ్మీర్ నుంచి అస్సాం, మణిపురి, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, కర్నాటక - ట్రయిల్ కోర్టులు, హైకోర్టుల్లో ఆయన తిరగని ప్రాంతం లేదు.

న్యాయస్థానం అంతరాత్మ

తమిళ టైగర్స్ అధినేత కిట్టూని భారత నావికాదళం పట్టుకొని ఆచూకీ లేకుండా చేసినప్పుడు, కిట్టూని కోర్టులో హాజరుపరచాలని హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు కన్నబిరాన్. ఆ సందర్భంగా కన్నబిరాన్ హైకోర్టులో వినిపించిన ఆర్గ్యూమెంట్ - న్యాయశాస్త్ర చరిత్రలో నిలిచిపోయే అద్భుత వాదనల్లో ఒకటిగా పేర్కొంటుంది న్యాయవాద వర్గం.

న్యాయవాదులకి ఆదర్శంగా నిలిచి దేశవ్యాప్తంగా పేరొందిన కన్నబిరాన్ నవంబర్ 19, 1929లో పుట్టారు. కన్నబిరాన్ పూర్వీకులు తమిళులు. కానీ, తరతరాలుగా ఆయన కుటుంబీకులు నెల్లూరులోనే జీవిస్తున్నారు. మొదటిరోజుల్లో ఆర్థికమైన ఇబ్బందులు చాలా పడి చివరికి న్యాయవాదిగా హైదరాబాదులో నిలదొక్కుకొన్నారు కన్నబిరాన్. ఆయన కోర్టులోకి నడిచొస్తుంటే న్యాయమూర్తులకి తమ అంతరాత్మ ఉనికి గుర్తొస్తుందని చెప్పుకునేవారు. అటువంటి న్యాయస్థానం అంతరాత్మ- కేజీ కన్నబిరాన్ డిశంబర్ 30, 2010న కన్నుమూశారు.

(ఈ రోజు కన్నబిరాన్ వర్థంతి)

Updated Date - 2022-12-30T14:57:22+05:30 IST