IND vs NED: మొనగాడినని మళ్లీ నిరూపించుకున్న కోహ్లీ.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే..
ABN , First Publish Date - 2022-10-27T14:32:32+05:30 IST
టీమిండియా, నెదర్లాండ్స్ (IND vs NED) జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో (T20 World Cup) టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి..
సిడ్నీ: టీమిండియా, నెదర్లాండ్స్ (IND vs NED) జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో (T20 World Cup) టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముందు ఉంచింది. 120 పరుగుల్లో 180 పరుగులు చేస్తేనే నెదర్లాండ్స్ గెలిచే ఛాన్స్ ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఆదిలో దురదృష్టం వెంటాడింది. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే.. వాస్తవంగా అది నాటౌట్. టీమిండియా రివ్యూ అడగకపోవడంతో కేఎల్ రాహుల్ వెళ్లిపోవాల్సివచ్చింది. ఔట్ కాదని తెలియడంతో పెవిలియన్‌కు వెళుతూ రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం 39 బంతుల్లో 53 పరుగులు చేసి రాణించాడు. పాక్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా 44 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఫామ్‌పై విమర్శలు చేసేవారికి ధీటుగా బదులిచ్చాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. 25 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇదిలా ఉండగా.. మంచి లక్ష్యాన్నే నిర్దేశించినా నెదర్లాండ్స్ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆల్‌రౌండర్ బాస్ లి లీడ్స్ జట్టులో కీలక ఆటగాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన అనుభవం ఉండడంతో.. ఇక్కడి పిచ్‌లపై అతడికి అవగాహన ఉంది. బ్యాటింగ్‌లో కొలిన్ ఎకర్‌మెన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. టాపార్డర్ సత్తా చాటాలి. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆస్ట్రేలియా-ఎకు ఆడిన టామ్ కూపర్‌కు కూడా విదేశీ లీగ్‌లు ఆడిన అనుభవం ఉంది.