IT Rides: వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇళ్లల్లో సోదాలు
ABN , First Publish Date - 2022-12-06T09:35:51+05:30 IST
వైసీపీ నేతలు దేవినేని అవినాష్(Devineni Avinash), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(MLA Vallabhaneni Vamsi) ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఈ తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్(Vamsiram Builders) సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో ఉదయం నుంచే సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
వైసీపీ నేతల ఇళ్లల్లోనూ దాడులు..
హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన ఐటీ అధికారులు విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్(Devineni Avinash), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(MLA Vallabhaneni Vamsi) ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్‌పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.
గత నెలలో హైదరాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో రెండు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేసింది. విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులుకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆదాయపు పన్నుశాఖ అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.