T Congress: రేవంతే టార్గెట్‌గా సీనియర్ల బ్లాస్ట్! అక్కడే తేల్చుకుంటామని ప్రకటన..!

ABN , First Publish Date - 2022-12-17T16:13:16+05:30 IST

ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ. దేశంలో, రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ. కానీ ఇప్పుడు అధికారం లేక గిజగిజలాడుతోంది. ప్రస్తుతం ఒకటి, రెండు రాష్ట్రాల్లో

T Congress: రేవంతే టార్గెట్‌గా సీనియర్ల బ్లాస్ట్! అక్కడే తేల్చుకుంటామని ప్రకటన..!
అక్కడే తేల్చుకుంటాం..

ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ. దేశంలో, రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ. కానీ ఇప్పుడు అధికారం లేక గిజగిజలాడుతోంది. ప్రస్తుతం ఒకటి, రెండు రాష్ట్రాల్లో తప్ప దేశంలో ఎక్కడా ఆ పార్టీ అధికారం లేదు. ఇంతకీ ఆ పార్టీ ఏదో గుర్తుకొచ్చే ఉంటుంది. అదేనండి 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. ఓ వైపు యువ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర అంటూ దేశమంతా చుట్టేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. దీనికి తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ‘మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు’ అంతంతమాత్రంగా నడుస్తున్న ఆ పార్టీ పరిస్థితి సీనియర్ల తిరుగుబాటుతో మరింత దిగజారిపోయింది.

రేవంత్‌రెడ్డే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా ఒక్కటయ్యారు. కొద్ది రోజుల కింద ఏర్పాటైన పీసీసీ కొత్త కమిటీ తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపింది. మొదటగా మాజీ మంత్రి కొండా సురేఖ అసమ్మతి గళం వినిపించగా.. ఆ తర్వాత బెల్లయ్య నాయక్.. వెనువెంట దామోదర్ రాజనర్సింహ అసమ్మతి స్వరాన్ని వినిపించారు. పదవులకు రాజీనామా చేసి కార్యకర్తలుగా కొనసాగుతామని వెల్లడించారు. తాజాగా సీనియర్ నాయకులంతా భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమై... వలసవాదులతో తెలంగాణ కాంగ్రెస్ బాగుపడదన్నారు. అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులం తామేనంటూ సీనియర్లు ప్రకటించారు. సేవ్ కాంగ్రెస్ అనే నినాదం ఎత్తుకున్నారు. ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తోనే తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వారితో కాంగ్రెస్ పార్టీ బాగుపడదని సీనియర్లంతా తేల్చేశారు. మరోవైపు సీనియర్లంతా సమావేశంలో ఉండగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్న మీ వెంటే నడుస్తానని ప్రకటించారు. ఇప్పటికే మర్రి శశిధర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రముఖ నేతలంతా కమలం గూటికి చేరగా.. తాజాగా ప్రధాని మోదీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకుంటున్న ఆ పార్టీ.. ఇప్పటికే రెండు సార్లు అధికారానికి దూరంగా ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే మూడోసారి కూడా భంగపాటు తప్పదనే అనుమానాలు కల్గుతున్నాయి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి..

నాలుగు పార్టీలు మారిన వాళ్లతో కాంగ్రెస్ పార్టీ బాగుపడదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిచెప్పారు. భట్టి విక్రమార్క నివాసంలో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తీన్మార్ మల్లన్న ఓ పోస్ట్ పెట్టాడు. పాత నాయకులను కోవర్టులుగా ముద్ర వేస్తున్నారు. ఆయనెవరు? సోషల్ మీడియాలో పేర్లు ఎందుకు పెట్టాలి?. పుట్టుక నుంచి చావు వరకు పార్టీలో ఉండే వాళ్లం. మేము ఒరిజినల్ కాంగ్రెస్ నేతలం. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు పోవాలని నిర్ణయించాం. పార్టీ వార్ రూమ్‌పై దాడి చేస్తే స్పందించాం. మరి పార్టీ నాయకులపై ప్రచారం చేస్తే ఎందుకు చర్యలు లేవు. సీవీ ఆనంద్‌తో మాట్లాడితే మీ మీద కూడా కొన్ని పోస్టులు ఉన్నాయని చెప్పారు. అధిష్టానం దగ్గర ఫైట్ చేస్తాం. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ డేమోక్రసి ఉంది. నేనే ఉండాలి.. నా వాళ్లే ఉండాలి అని ఎప్పుడూ అనుకోలేదు. డీసీసీ అధ్యక్ష నియామకం కూడా గెలిచే చోట డీసీసీల నియామకం ఆపేశారు. కావాలనే ఇలా చేశారు. ఏడు డీసీసీలు కావాలనే ఆపారు. ఉపాధ్యక్షుడు, జీఎస్‌లు బయట పార్టీ వాళ్లు ఎక్కువ ఉండటం మంచిది కాదు. 180 పోస్టుల్లో 50, 60 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. ఇది మంచిది పద్ధతి కాదు. త్వరలో అధిష్టానాన్ని కలుస్తాం. పైన ఉన్నవాళ్లకు అవగాహన లేకపోవచ్చు.’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

భట్టి విక్రమార్క..

అసలు కాంగ్రెస్ నాయకులకు.. వలస వాదులకు చాలా వ్యత్యాసం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ‘‘కాంగ్రెస్‌లో పుట్టి పెరిగి.. భావజాలం నమ్మిన అనేక మందికి తాజా పీపీసీ కమిటీ ఏర్పాటుతో ఇబ్బంది ఏర్పడింది. ఆ బాధతోనే చాలా మంది పర్సనల్‌గా వచ్చి కలుస్తున్నారు. జిల్లాల వారిగా మాతో మాట్లాడాలి కదా? అని ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. నేను కూడా వాళ్లకు జరిగిన నష్టానికి మనస్తాపం చెందా. కాంగ్రెస్‌ను రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే సీనియర్లమంతా ఏకమయ్యాం. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు పోవాలని నిర్ణయించాం. కావాలనే కొందరు నేతలను నష్టపరిచేలా సోషల్ మీడియాలో క్యారెక్టర్‌ను దెబ్బ తీస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఈ తతాంగమంతా జరుగుతోంది. కుట్ర పూరితంగానే జరుగుతోంది. కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవాలనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.’’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

మధుయాష్కీ...

క్యారెక్టర్ లేని వాళ్లు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని మధుయాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్‌ను నాశనం చేసే కుట్ర జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలతో కుమ్మక్కైనోళ్లు.. వ్యాపారం చేసేవాళ్లతో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. పీజేఆర్ కుమారుడికి పార్టీలో ప్రాతినిధ్యం లేదని విమర్శించారు. పార్టీకి అన్యాయం చేసేందుకు ఎవరో వచ్చారన్న చర్చ జరుగుతుందని చెప్పారు. చెట్టు మీద కూర్చుని కొమ్మను నరుక్కోవడం లేదని మధుయాష్కీ వ్యాఖ్యానించారు.

జగ్గారెడ్డి...

రాహుల్ గాంధీ కోసం ఎంతో ఖర్చు చేశామని జగ్గారెడ్డి అన్నారు. అయినా కూడా ఇప్పుడు మళ్లీ తమను కోవర్టులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఉనికిని కాపాడిన మమ్మల్ని కోవర్టలు అంటున్నారని... అయినా వలస నాయకుడి ఖండన లేదు.. ఏఐసీసీ ఖండన లేదని వాపోయారు. మరియమ్మ విషయంలో ఏఐసీసీ అనుమతితో సీఎం కేసీఆర్‌ను కలిశాం... ఆరోజు కూడా వలస నాయకులు బద్నాం చేశారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-17T16:14:32+05:30 IST