Share News

Payyavula Keshav: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్.. అనంతలో హైటెన్షన్

ABN , Publish Date - Dec 19 , 2023 | 02:25 PM

Andhrapradesh: రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్‌కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు.

Payyavula Keshav: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్.. అనంతలో హైటెన్షన్

అనంతపురం: రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను (Uravakonda MLA Payyavula Keshav) పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్‌కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు. పయ్యావుల కేశవ్ అరెస్టు సమయంలో రైతులు వర్సెస్ పోలీసుల మధ్య తీవ్రతోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. పయ్యావుల కేశవ్‌ను అరెస్టు చేసేందుకు రెండు గంటల పాటు పోలీసుల తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పయ్యావుల కేశవ్‌తో పాటు ముఖ్య నాయకులను అరెస్టు చేసి రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు.


కాగా.. జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం బళ్లారి - అనంతపురం జాతీయ రహదారిపై హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు. జీబీసీ కాలువ కింద రైతులు వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. సాగునీటిని విడుదల చేయకపోవడంతో మిర్చి పంటలు ఎండిపోతున్న పరిస్థితి. మిర్చి పంట ఎండిపోతుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీబీసీకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హంద్రీనీవా కాలువ వద్ద పయ్యావుల కేశవ్ బైఠాయించిన నిరసన చేపట్టారు. అయితే పయ్యావుల ఆందోళనను విరమింపచేసేందుకు పోలీసులు యత్నించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు పూనుకున్నారు. పయ్యావుల అరెస్ట్ సమయంలో హంద్రీనీవా కాలువ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పయ్యావుల కేశవ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. గుంతకల్లు డిఎస్పీ నర్సింగప్ప ఆందోళన వద్దకు చేరుకున్నారు. పోలీసులను కేశవ్ దగ్గరకు రానివ్వకుడా రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులపై రైతులు తిరగబడ్డారు. పయ్యావులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించారు. అయితే హంద్రీనీవా నుంచి జీబీసీకి నీటిని విడుదల చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. రైతుల ఆందోళన పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పయ్యావుల ఆందోళనతో హంద్రీనీవా కాలువ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పయ్యావులను పోలీసులు అరెస్ట్ చేసి కనేకల్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 19 , 2023 | 02:25 PM