Share News

AP TDP Chief: చంద్రబాబు ఆరోగ్యంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-13T12:42:56+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడి చేయకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

AP TDP Chief: చంద్రబాబు ఆరోగ్యంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaiudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడి చేయకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశమయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు సొంత డాక్టర్లను ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు సంప్రదించ లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్లు చెబుతామన్నా.. వద్దని పోలీసులు ఒత్తిడి తెచ్చారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పొద్దని డాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత డాక్టర్ల బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్సు ఆస్పత్రికి చంద్రబాబును తరలించాలన్నారు. ప్రభుత్వం మీద.. ప్రభుత్వ ఆస్పత్రుల మీద తమకు నమ్మకం లేదన్నారు. చంద్రబాబుకు స్టెరాయిడ్లిచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.


చంద్రబాబుకు ఏదైనా జరిగితే కర్త, ఖర్మ, క్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు. చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 34 రోజులుగా జైల్లో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం.. భద్రత విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తాము చెబుతూనే ఉన్నామన్నారు. ఇప్పుడు చంద్రబాబు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. ఆరోగ్య క్రమశిక్షణ పాటించడం వల్లే 73 ఏళ్లున్నా 20 ఏళ్ల యువకుడిలా చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు డీహైడ్రేషన్ బారిన పడ్డారన్నారు. చంద్రబాబుకున్న స్కిన్ ప్రాబ్లం వల్ల ఏసీ తప్పనిసరి అని అన్నారు. కనీసం వేన్నీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. డీహైడ్రేషన్, స్కిన్ ప్రాబ్లం వల్ల చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. చంద్రబాబు ఒకేసారి ఐదు కేజీల బరువు తగ్గారని.. బరువు తగ్గితే శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుందని డాక్టర్లు చెబుతున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-13T12:46:49+05:30 IST