APPCC Chief: బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి
ABN , First Publish Date - 2023-08-04T15:13:32+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు వేసిన కేసులలో సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై Congress Leader Rahul Gandhi) బీజేపీ నేతలు వేసిన కేసులలో సుప్రీం కోర్ట్ (Supreme Court)స్టే ఇవ్వడం పట్ల ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం గెలిచిందని.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయన్నారు. కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి దుర్మార్గమైన చర్యలకు బీజేపీ పూనుకుందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజల మనసు గెలుచుకున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాకుండా ఎవ్వరూ ఆపలేరని ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.
కాగా.. ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాహుల్ దోషి అంటూ గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం నిలిపేయడంతో ఆయన పార్లమెంటులో తన గళాన్ని వినిపించే అవకాశం మళ్లీ రాబోతోంది. దీనికి సంబంధించిన లోక్‌సభ సచివాలయం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.