Nara Lokesh: భారతిరెడ్డికి మరోసారి నారా లోకేష్ సవాల్
ABN , First Publish Date - 2023-04-21T21:31:24+05:30 IST
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan Mohan Reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
కర్నూలు: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan Mohan Reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నదే తన కల అని, ప్రజల్లో ఉన్న తనను పరదాల జగన్ అడ్డుకోవాలని ప్రయత్నించారని విమర్శించారు.
పరదాల జగన్‌రెడ్డికి ప్రజలు బై బై చెప్పడం ఖాయమని, జగన్‌రెడ్డికి సొంత పేపర్, సోషల్ మీడియా లేదంటా.. మరి సాక్షి పేపర్, 5 రూపాయల పేటీఎం గ్యాంగ్ ఎవరిది?, జగన్‌కు డబ్బు లేదంటా.. మరి దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరు? అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ మాటలు వింటే అబద్ధమే సిగ్గుపడుతుందని, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట అని నారా లోకేష్ మండిపడ్డారు.
జగన్ మాటలు ఎవరూ నమ్మట్లేదనే భారతిరెడ్డిని (Bharathi Reddy) రంగంలోకి దింపారని, ఆవిడ ఒక ఫేక్ వీడియో తయారు చేసి సాక్షిలో వదిలారని, దళితులను అవమానించారంటూ తనపై వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. భారతిరెడ్డికి మరోసారి సవాల్ చేస్తున్నానని, దళితులను అవమానించానని నిరూపిస్తే రాజకీయాలే వదిలేస్తానని లోకేష్ సవాల్ చేశారు. భారతిరెడ్డి నిరూపించలేకపోతే దళితులకు క్షమాపణ చెప్పి సాక్షి మీడియాను మూసేస్తారా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
జగన్‌రెడ్డి ఒక ఊసరవెల్లి, 3 రాజధానులంటూ నాటకాలు తప్ప ఒక్క ఇటుక పెట్టింది లేదని, ఉత్తరాంధ్ర ప్రజలు చాచిపెట్టి కొట్టినా.. జగన్‌కు బుద్ధి రాలేదన్నారు. జగన్ సెప్టెంబర్‌లో వైజాగ్‌లో కాపురం పెడతా అంటున్నారని, తమరు ఎక్కడ కాపురం పెట్టావన్నది కాదని, అమూల్ బేబీ ఏం పీకావ్ అన్నది ముఖ్యమని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. 2024లో జగన్ లండన్‌లో కాపురం పెట్టడం ఖాయమని, జగన్ ఫ్యామిలీ చంచల్‌గూడ జైలుపైనే బతికేస్తున్నారని కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం కడితోట జరిగిన టీడీపీ బహిరంగ సభలో లోకేష్ విమర్శించారు.