MP Avinash: ఉత్కంఠకు తెర.. ఎంపీ అవినాశ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు.. ఈసారి కొత్తగా..

ABN , First Publish Date - 2023-05-16T14:39:05+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.

MP Avinash: ఉత్కంఠకు తెర.. ఎంపీ అవినాశ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు.. ఈసారి కొత్తగా..

హైదరాబాద్/అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న మరోసారి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు ఉదయం వివేకా కేసులో సీబీఐ విచారణకు అవినాశ్ హాజరుకావాల్సి ఉంది. అయితే అత్యవసర పనుల వల్ల విచారణకు హాజరుకాలేనని.. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని సీబీఐను ఎంపీ కోరారు. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా అవినాశ్ లేఖ పంపారు. అయితే తొలుత ఎంపీ విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించింది. విచారణకు హాజరుకావాల్సిందే అంటూ సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఇచ్చి కొన్ని గంటల గడువక ముందే అవినాశ్ లేఖపై సీబీఐ మరోసారి స్పందించింది. ఈ సారి సానుకూలంగా స్పందించిన సీబీఐ ఈనెల 19న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ సారి కొత్తగా వాట్సప్ ద్వారా అవినాశ్‌కు సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. మొత్తానికి సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుపై ఈరోజు ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది.

పులివెందులకు అవినాశ్ రెడ్డి

కాగా..అంతకుముందు గడువు కావాలంటూ రాసిన లేఖను సీబీఐ తిరస్కరించినప్పటికీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు విచారణకు రావాల్సిందే అంటూ మొదట సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీ అవినాశ్ సీబీఐ ఆదేశాలను పట్టించుకోకుండా పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. పులివెందులలో ఈరోజు జరగబోయే కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు.

కాగా.. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో దాదాపు 20 రోజుల తర్వాత అవినాశ్‌కు 160 సీఆర్పీసీ కింద సీబీఐ మరోసారి నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయం ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో పలు దఫాలుగా విచారణ చేసి స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో అవినాష్ పిటిషన్ వేయగా... అందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కుట్రలో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేక హత్య కేసులో 20 రోజుల పాటు విరామం తర్వాత సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈరోజు హాజరుకాలేంటూ సీబీఐకు ఎంపీ అవినాశ్ లేఖ రాయడం.. అందుకు తొలుత సీబీఐ అంగీకరించకపోవడం.. ఆపై సానుకూలంగా స్పందిస్తూ ఎంపీకి సీబీఐ మరోసారి నోటీసులు ఇవ్వడం వెను వెంటనే జరిగిపోయాయి.

Updated Date - 2023-05-16T14:39:16+05:30 IST