Vizag Steel Plant Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటనే చేసిందిగా..!

ABN , First Publish Date - 2023-04-14T16:29:50+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై (Vizag Steel Plant Privatization) కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (Faggan Singh Kulaste) చేసిన వ్యాఖ్యలతో..

Vizag Steel Plant Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటనే చేసిందిగా..!

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై (Vizag Steel Plant Privatization) కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (Faggan Singh Kulaste) చేసిన వ్యాఖ్యలతో గందరగోళం నెలకొనడంతో కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోలేదని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది.

Ministry-Of-Steel.jpg

పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని పేర్కొంది. RINL పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగలేదని కేంద్రం వివరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ (Visakha Steel Plant) పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.

కేంద్రం తాజా ప్రకటనకు కారణం ఏంటంటే..

ప్రధాని రోజ్‌గార్‌ యోజన మేళాలో పాల్గొనడానికి గురువారం విశాఖపట్నం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే పోర్టు స్టేడియంలో ఉదయం 11.30 గంటలకు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ప్లాంటు విక్రయం ఆలోచన లేదన్నారు. రాబోయే రోజుల్లో కర్మాగారాన్ని బలోపేతం చేస్తామని.. ముడి పదార్థాలు, సొంత గనులు వంటి సమస్యలున్నాయని, వాటి పరిష్కారంపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. దీంతో ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసిందని అంతా అనుకున్నారు. విశాఖ ఉక్కు విక్రయంపై కేసీఆర్‌ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎలా అమ్ముతారో చూస్తాం. సింగరేణి అధికారులను పంపి అధ్యయనం చేయిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పగానే విశాఖ ఉక్కును అమ్మే ప్రతిపాదనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు కేంద్రం ఇప్పుడే ప్రకటించింది. కేసీఆర్‌ దెబ్బ ఎట్లుంటదంటే.. గట్లుంట ది’ అని హైదరాబాద్‌లో చెప్పారు.

ఏపీలో అధికార పక్షం నోరుమూసుకున్నా.. ప్రతిపక్షం ప్రశ్నించకపోయినా.. కార్మికులు, ప్రజలు, బీఆర్‌ఎస్‌ పోరాటం చేసినందుకే కేంద్రం దిగి వచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందని మరో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కూడా స్పష్టం చేశారు. అయితే కొద్ది గంటల్లోనే కేంద్ర మంత్రి మాట మార్చేశారని కార్మిక నాయకులు ఆరోపించారు. విశాఖ నోవాటెల్‌లో మంత్రి కులస్తేతో విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఉక్కు కార్మిక సంఘ నాయకులు ఆదినారాయణ, అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, వరసాల శ్రీనివాసరావు సమావేశమయ్యారు.

మంత్రి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికే సంస్థ లిస్టింగ్‌(విక్రయించే)లో ఉందని వ్యాఖ్యానించినట్లు నాయకులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తన ఒక్కడి వల్ల ఏమీ కాదని, సంస్థను ప్రస్తుతం నష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ యత్నించాలని ఆయన కోరినట్లు తెలిసింది. గంటల వ్యవధిలో కేంద్ర మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ఇలా మాట మార్చడంతో విస్తుపోవడం ఏపీ జనాల వంతైంది. కేంద్రం తాజా ప్రకటనతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడం లేదని స్పష్టమైంది.

Updated Date - 2023-04-14T16:35:53+05:30 IST