TTD Chairman: టీటీడీ 53వ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భూమన.. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యమన్న కొత్త చైర్మన్

ABN , First Publish Date - 2023-08-10T13:39:39+05:30 IST

టీటీడీ 53వ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన చేత ఈవో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

TTD Chairman: టీటీడీ 53వ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భూమన.. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యమన్న కొత్త చైర్మన్

తిరుమల: టీటీడీ 53వ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Chairman Bhumana Karunakarreddy) ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలోని గరుడాళ్వార్ సన్నిధిలో భూమన చేత టీటీడీ ఛైర్మన్‌గా ఈవో ధర్మారెడ్డి (EO Dharmareddy) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... జగన్ ఆశీస్సులతో రెండవ సారి స్వామి వారి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. సామాన్య భక్తులకే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వీఐపీలకు ఊడిగం చెయ్యనని తెలిపారు. మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తానన్నారు. హిందు ధార్మికతను విశ్వవ్యాప్తం చేస్తానని చెప్పారు.

‘‘మనం ఎంత సేపు స్వామి వారిని దర్శించుకున్నాం అన్నది ముఖ్యం కాదు.. క్షణ కాలం పాటు మనల్ని భగవంతుడు చూస్తున్నాడా లేదా అన్నది ముఖ్యం... వీఐపీలు ఇది గుర్తుపెట్టుకోండి’’ అని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు.


లక్షల మంది చైర్మన్ పదవి రేసులో ఉండగా.. స్వామి వారి అనుగ్రహంతో సామాన్యుడైన తనకు చైర్మన్ పదవి లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు సామాన్య భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా సులభతరంగా దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. దళిత గోవిందం, పున్నమి గరుడ సేవ, కళ్యాణమస్తు, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ లాంటి ఎన్నో సంస్కరణలను గతంలో తెచ్చానని గుర్తుచేశారు. టీటీడీ ఉద్యోగులకు త్వరలోనే ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విప్ చెవిరెడ్డి హాజరయ్యారు.

Updated Date - 2023-08-10T13:47:48+05:30 IST