Jagan Tour: షరా మామూలే.. సీఎం రాకతో నగరిలో ట్రాఫిక్ కష్టాలు
ABN , First Publish Date - 2023-08-28T09:15:16+05:30 IST
సీఎం జగన్ పర్యటిస్తున్నారంటే చాలు అక్కడి అధికారులు, పోలీసుల హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం వచ్చి వెళ్లేదాకా ఆ ప్రాంతవాసులకు చుక్కలు కనిపించడం ఖాయం. సీఎం వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటారు.
చిత్తూరు: సీఎం జగన్ (CM YS Jaganmohan reddy) పర్యటిస్తున్నారంటే చాలు అక్కడి అధికారులు, పోలీసుల హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం వచ్చి వెళ్లేదాకా ఆ ప్రాంతవాసులకు చుక్కలు కనిపించడం ఖాయం. సీఎం వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటారు. దీంతో సీఎం పర్యటన జరిగే ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. తాజాగా నగరిలోనే ఇదే పరిస్థితి ఎదురైంది. ఈరోజు నగరిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. జగన్ కార్యక్రమం సందర్భంగా పుత్తూరు - నగరి మార్గంలో వాహనా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక నుంచి నగిరికి వెళ్లే మార్గంలో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. బైపాస్ రోడ్డులోను.. పట్టణంలోకి సోమవారం ఉదయం నుంచే వాహనాలను అనుమతించడం లేదు. ఈ ట్రాఫిక్ వల్ల మధ్యాహ్నం వరకు ప్రయాణికులు నగరికి చేరుకోలేని పరిస్థితి తలెత్తింది.
మరోవైపు సభకు వచ్చే జనాల కోసం మజ్జిగ ప్యాకెట్లు తీసుకొస్తున్న ట్రక్కు లారీ సభా వేదిక ముందు బురద మట్టిలో దిగబడింది. లారీ డ్రైవర్ గంటసేపు ప్రయత్నించిన వాహనం ముందుకు కదల్లేదు. దీంతో పోలీసులు, కొంతమంది వైసీపీ నాయకులు చేరుకొని మట్టిలో దిగబడిన లారీని జేసీబీ సాయంతో ముందుకు కదిలించారు. లారీ దిగబడడంతో ఉన్నతాధికారులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. జేసీబీ సాయంతో ఎట్టకేలకు దిగబడిన లారీని ముందుకు కదిలించడంతో ఊపిరి పీల్చుకున్నారు. సీఎం కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాల వాహనాలు, ఆర్టీసీ బస్సులు ద్వారా సభకు జనాన్ని తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా సమీప పొరుగు తమిళనాడు రాష్ట్రం నుంచి సభకు జనాలు తరలిస్తున్నారు. విద్యార్థులను బస్సుల ద్వారా భారీగా తరలిస్తున్నారు. నగిరి పట్టణం మొత్తం పోలీసులకు గుప్పిట్లోకి వెళ్లిపోయింది. నగిరి చుట్టుపక్కల మొత్తం ఆంక్షలు పేరుతో పోలీసులు విధించిన నిబంధనలతో సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా.. నేడు నగరిలో పర్యటించనున్న సీఎం జగన్.. జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు బటన్ నొక్కి విద్యాదీవెన, వసతిదీవెన విడుదల చేయనున్నారు. విద్యా దీవెన పథకం కింద మూడో విడత నిధుల జమకు బటన్ నొక్కేందుకు సీఎం నగరికి రానున్నారు.