Nara Lokesh: ఆ మూడు ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లా చేస్తాం.. సభలో పాల్గొన్న నల్లారి కిశోర్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-03-05T17:55:06+05:30 IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. ఉద్యోగులు, పోలీసుల సమస్యలను చూస్తే బాధగా ఉందని, వచ్చేది తమ ప్రభుత్వమే, ఉద్యోగులు, పోలీసుల సమస్యలను పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా పీలేరులో జరుగుతున్న బహిరంగ సభలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. గతంలో జాబ్ క్యాపిటల్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏపీ వచ్చేదని, ఇప్పుడు గంజాయి క్యాపిటల్ అని సెర్చ్ చేస్తే ఏపీ వస్తుందని లోకేష్ విమర్శించారు. అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉంటే గంజాయి స్మగ్లర్లకు చుక్కలు చూపించేవారని, వైసీపీ పాలనలో టెన్త్ విద్యార్థులతో గంజాయి విక్రయం, వినియోగం చేయిస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
తాము వచ్చాక గంజాయి స్మగ్లర్లను తరిమికొట్టే బాధ్యత తనది అని లోకేష్ అన్నారు. విశాఖ సమ్మిట్‌లో రూ.76 వేల కోట్లు పెడతామని ఓ కంపెనీ వచ్చిందని, గూగుల్‌లో చూస్తే ఆ కంపెనీ పెట్టుబడి కేవలం రూ.లక్ష అని, ఆ కంపెనీ పులివెందులదని తెలిసిందని నారా లోకేష్ అన్నారు. కేవలం 50 మంది ఉండే మరో కంపెనీ రూ.వేల కోట్ల పెట్టుబడి పెడుతుందట, నమ్ముదామా? అని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల చీటి అబద్ధమని, ఏపీకి వచ్చిన బంగారం లాంటి సంస్థలు వెనక్కిపోయాయని లోకేష్ అన్నారు. జగన్ 8వ సారి కరెంట్ చార్జీలు పెంచబోతున్నారని, జగన్‌రెడ్డి ఓ కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ అని నారా లోకేష్ విమర్శించారు.
పులివెందుల కంపెనీలకు భూములు కట్టబెడుతున్నారని, జగన్ పాలనలో ముస్లింలు కష్టాలు, అవమానాలు పడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, అక్రమంగా ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. పాపాల పెద్దిరెడ్డికి ఓ భూమిపై కన్నుపడితే ఆ భూమి గోవిందా అని, హంద్రీనీవా సహా ప్రాజెక్టులను పూర్తి చేయలేదని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. చెక్ డ్యామ్‌లు కొట్టుకుపోతే మరమ్మతులు చేయలేదని, పెద్దఎత్తున పీలేరుకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని, పుంగనూరు, పీలేరు, మదనపల్లిని కలిపి ప్రత్యేక జిల్లా చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. తిరుపతి పీలేరులో జరిగిన నారా లోకేష్ బహిరంగ సభకు వివిధ గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. లోకేష్ బహిరంగ సభలో నల్లారి కిశోర్‌రెడ్డి (Nallari Kishore Reddy) పాల్గొనడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.