Gidugu Rudraraju: రాజకీయంగా గాంధీ-నెహ్రూ కుటుంబం ఉనికి లేకుండా చేసే కుట్ర

ABN , First Publish Date - 2023-04-01T18:09:30+05:30 IST

ఏపీసీసీ (APCC) అత్యవసర సమావేశం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Gidugu Rudraraju: రాజకీయంగా గాంధీ-నెహ్రూ కుటుంబం ఉనికి లేకుండా చేసే కుట్ర

విజయవాడ: ఏపీసీసీ (APCC) అత్యవసర సమావేశం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నెల మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం దుర్మార్గమని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) అన్నారు. రాజకీయంగా గాంధీ-నెహ్రూ కుటుంబ ఉనికి లేకుండా చేసే కుట్ర జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ ఆందోళనలు చేపడతామని రుద్రరాజు తెలిపారు. ఈ నెల 4న పోస్టుకార్డుల ఉద్యమం, 15 నుంచి కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు, 20-30 వరకు రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. BJP అంటే చంద్రబాబు, జగన్‌, పవన్ అని గిడుగు రుద్రరాజు ఆరోపించారు.

వైసీపీ (YCP) పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని గిడుగు రుద్రరాజు విమర్శించారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ (Congress) దెబ్బతిందన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి.. ప్రజలు కాంగ్రెస్ వస్తేనే మంచిదని భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అనేక సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. ఏపీ రాజధాని అమరావతి (Amaravathi) నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్తామని గిడుగు రుద్రరాజు అన్నారు. తమ పోరాటం వైసీపీ, కేంద్రంలో బీజేపీపై అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రంలో యువతకి ఉపాధి దొరుకుతుందన్నారు. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చే అంశంపై తొలి సంతకం చేస్తామన్నారని గిడుగు రుద్రరాజు గుర్తు చేశారు.

Updated Date - 2023-04-01T18:10:08+05:30 IST