Devineni Uma: సీఎం జగన్‌తోపాటు ఆ ఇద్దరూ జైలుకెళ్లడం ఖాయం
ABN , First Publish Date - 2023-11-08T20:07:39+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. నాడు హిట్లర్ వద్ద పని చేసిన గోబెల్స్‌ను నేడు జగన్ వద్ద పనిచేస్తున్న సజ్జల మించిపోయాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి.. ప్రజలకు జగన్ ఎందుకు అవసరమో సజ్జల చెప్పాలని, వివేకానందరెడ్డిని చంపినవారిని కాపాడుతున్నందుకా.. తన దోపిడీ..అవినీతి..దుర్మార్గపు పాలనను ప్రశ్నించిన మీడియాపై.. ప్రతి పక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నందుకా? అని ప్రశ్నించారు.
"రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నందుకా.. లేక తండ్రి అధికారంతో లక్షకోట్లు.. నాలుగున్నరేళ్లలో రూ.2.50 లక్షలకోట్లు కొట్టేసినందుకు రాష్ట్రానికి జగన్ అవసరమా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తున్న తన పార్టీవారిని.. మహిళలపై దారుణాలకు తెగబడుతున్న కామాంధులకు కొమ్ముకాస్తున్నందుకు రాష్ట్రానికి జగన్ అవసరమా?. ఇసుక కుంభకోణంలో జగన్ రెడ్డి.. సజ్జల.. పెద్దిరెడ్డి జైలుకెళ్లడం ఖాయం. జగన్ రెడ్డి.. సజ్జల.. ధనుంజయరెడ్డి కలిసి రాష్ట్రంలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తూ.. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారు. వాలంటీర్లు.. సచివాలయ సిబ్బందికి వందలకోట్లు ఖర్చుపెట్టి ముద్రించిన నకిలీ బ్యాలెట్ పత్రాలు ఇచ్చి ప్రజల్ని భయపెట్టిస్తున్నారు." అని దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"వైసీపీకి ఓటేయకపోతే పథకాలు ఆపేస్తామని.. భూములు లాక్కుంటామని.. ఇళ్లు కూల్చేస్తామని వైసీపీ నేతల కనుసన్నల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్లు స్పందించడంలేదు. తప్పులకు.. తప్పుడు మనుషులకు కొమ్మకాస్తున్న కలెక్టర్లారా జరభద్రం.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని గుర్తుంచుకోండి. రాష్ట్రంలో 440 మండలాల్లో తీవ్ర దుర్భిక్షపరిస్థితి ఉంటే.. ముఖ్యమంత్రి రైతులు సంతోషంగా ఉన్నారని అబద్ధాలు చెబుతున్నారు. చేతగాని దద్దమ్మలు.. జగన్ రెడ్డి, అంబటి పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. పట్టిసీమ పంపులు పీకుతామన్న జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యముంటే ఇప్పుడు ఆ లిఫ్ట్ జోలికి వెళ్లాలి. తన వైఫల్యాలు చెప్పుకోవడానికి జగన్ రెడ్డి నామోషీగా ఫీలవుతున్నారు." అని దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.