AP Roads Damage: దారెక్కడ.. దేవుడా!?
ABN , First Publish Date - 2023-07-30T03:07:53+05:30 IST
కొద్దిరోజులుగా వర్షాలు ( Rains)కుమ్మేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రా ష్ట్ర, జిల్లా గ్రామీణ రహదారులు(Roads) చెరువులు, స్విమ్మింగ్‌పూల్స్(Swimming pools)ను తలపిస్తున్నాయి.
కాలు కదపాలన్నా.. కారు కదలాలన్నా ‘దారి’.. తెన్నూ లేదు
అడుగుకో గుంత.. ప్రమాద స్థితిలోకి బ్రిడ్జిలు, కల్వర్టులు
అమ్మో.. అంతర్రాష్ట్ర రహదారి
ఓ గుంత దాటే లోపలే మరో గుంత. అటూ ఇటూ గుంతలే. తప్పించుకునే వీలే లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం నుంచి కూనేరుకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి దుస్థితి ఇది. ఈ మార్గంలో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కొమరాడ మండలం అర్తాం గ్రామం వద్ద గోతిలో దిగబడ్డ వాహనం
రోడ్లను గాలికొదిలేసిన సర్కారు
నిర్వహణకు నోచుకోని
29,631 కి.మీ. ఆర్‌అండ్‌బీ రోడ్లు
నాలుగేళ్లలో 2,369 కి.మీ.పైనే దృష్టి
అవి కూడా ఐప్యాక్ చెప్పిన వాటికే మోక్షం
అందులోనూ సగం వర్క్‌లు పెండింగ్
రోడ్లకు తారు, ప్యాచ్‌వర్క్‌లతోనే నిర్వహణ
కానీ, ఏపీలో రోడ్లు అద్భుతం అంటూ
సోషల్ మీడియాలో ప్రచారం రోడ్లను గాలికొదిలేసిన సర్కారు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కొద్దిరోజులుగా వర్షాలు ( Rains)కుమ్మేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రా ష్ట్ర, జిల్లా గ్రామీణ రహదారులు(Roads) చెరువులు, స్విమ్మింగ్‌పూల్స్(Swimming pools)ను తలపిస్తున్నాయి. వాహనరాకపోకలకు తీవ్ర అగచాట్లు ఎదురవుతున్నా యి. రోడ్ల(Roads)పై గుంతలు చూసి ఛీ.. ఇదేం పాలనంటూ జనం ఛీత్కరించుకుంటున్నారు. పరిస్థితి ఇంతలా దిగజారి ఉంటే.. ‘‘దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అద్భుతమైన రహదారుల ని ర్మాణం. జగనన్న మాటిచ్చారు.. అత్యాధునికమైన టెక్నాలజీతో రోడ్లు నిర్మించారు. ఇంత అందమైన రోడ్లు మరెక్కడైనా ఉన్నాయా’’.. కలర్‌పుల్ గ్రాఫిక్స్‌తో కూడిన ఫొటోలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో తెగ వైరలవుతున్నాయి. అవన్నీ ఏపీలో ఉన్న అందమైన అద్దంలా మెరిసే రోడ్లంటూ వైసీపీ సోషల్ మీడియా(YCP Social media), వారి అనుకూలురు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ జగన్ (Jagan)అధికారం చేపట్టిన నాలుగేళ్లలో ఎన్ని కిలోమీటర్ల రహదారులు బాగుపడ్డా యో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే! జూన్ మొదటి వారం నాటికే సర్కారు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 8వేల కిలోమీటర్ల రాష్ట్ర ప్రధాన రోడ్లు(స్టేట్ రోడ్స్ ), జిల్లా ప్రధాన రోడ్లు(ఎండీఆర్), గ్రామీణ రోడ్ల నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టాలి. ఆర్‌అండ్‌బీ నియంత్రణలో 45, 317 కిలోమీటర్ల రహదారులు ఉంటే, అం దులో స్టేట్ రోడ్లు 12,592 కిమీ, జిల్లా ప్రధాన రహదారులు 32,725 ఉన్నాయి. కేం ద్రం నిర్వహణలోని జాతీయ రహదారులు 8,613 కిమీ ఉన్నాయి. ప్రభుత్వం తన నిధులతో ఏటా 8వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్వహణ చేపట్టాలి. పాడైన బ్రిడ్జిలను బాగు చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం ఏటా రూ.2500 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంది. దీంతోపాటు కేంద్రం నుంచి సీఆర్‌ఎఫ్, నాబార్డు...గ్రామీణ రహదారులు. తదితర పద్దుల కింద నిధులు ఇస్తున్నాయి. అయితే, గత నాలుగేళ్లుగా జగన్ సర్కారు రహదారులకు ప్రాధాన్యతేఇవ్వడం లేదు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక వార్తలను ప్రచురించింది.
గాలికి వదిలేశారు.. నిబంధనల ప్రకారం, ఏటా 8వేల కిలోమీటర్ల చొప్పున నాలుగేళ్లలో 32వేల కిలోమీటర్ల రహదారుల నిర్వహణను సర్కారు పూర్తిచేయాల్సిఉంది. కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రం తన వాటాగా కేటాయించిన నిధులను పక్కదారి మళ్లించి, రోడ్లను గాలికొదిలేసింది. ఫలితం రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రాజకీయపక్షాలు, సామాన్యుల ఆందోళనలతో ఏపీ రోడ్లు అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయి. ఇక పరువు పోయిందని భావించిన ప్రభుత్వం 2021లో బ్యాంక్ బరోడా నుంచి 2200 కోట్ల అప్పు తీసుకొచ్చి 7900 కిలోమీటర్ల వర్క్‌లు చేపడతామని హడావుడి చేసింది. 2021-22, 2022-23 సంవత్సరాల్లో ఆ వర్క్‌లు పూర్తిచేస్తామని గొప్పలు చెప్పింది. కానీ, అందులో 2369 కిలోమీటర్ల పరిధిలోనే వర్క్‌లు చేసింది. వీటిల్లో సింహభాగం ఐప్యాక్ సిఫారసు చేసినవే ఉన్నా యి. ఇందులోనూ సగం వర్క్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
ఇక్కడ రోడ్డు ఉండేది..
అనంతపురం జిల్లా కదిరి-రాయచోటి ప్రధాన రహదారిపై నంబులపూలకుంట తహసీల్దారు కార్యాలయం ఎదుట రహదారి ఉండేది అని చదువుకోవాల్సిన పరిస్థితి. ఈ రహదారి విస్తరణ పనులను ఏడాది క్రితం మొదలు పెట్టారు. నిధుల లేమి కారణంగా పూర్తి చేయలేదు. దీంతో 30 కిలోమీటర్లు విస్తరించిన ఈ రోడ్డుపై ప్రయాణానికి రెండు గంటలు పడుతోంది.
రోడ్డును వెతుక్కోవాలి..
అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఆర్‌అండ్‌బీ రహదారుల రూపు మారిపోయింది. తుని-నర్సీపట్నం ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఎ.శరభవరం వద్ద, మన్యపురట్ల దగ్గర తారురోడ్డు ఆనవాళ్లు లేవు. నాతవరం మెయిన్‌రోడ్డు పెద్దపెద్ద గోతులతో దర్శనమిస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు.
సరాసరి గోతిలోకే..
విజయవాడలోని చనుమోలు వెంకట్రావు(సీవీఆర్) ఫ్లైఓవర్‌పై వానచినుకుపడితే గుంతల్లో నీళ్లు చేరతాయి. రోడ్డు ఉంది కదా అని బైకు నడిపితే ఆ గుంతల్లో పడిపోతారు. అదే కారు పడితే పంక్చర్ కావాల్సిందే. ఫ్లై ఓవర్ శ్లాబ్ పైభాగంలో గోతులు పడ్డాయి. ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నా యి. గతంలో ఈ రోడ్డుకు ఆర్‌అండ్‌బీ మరమ్మతులు చేపట్టేది. ప్రభుత్వం నుంచి మెయింటినెన్స్ నిధులు లేవని చేతులెత్తేసింది. దీంతో విజయవాడ కార్పొరేషన్ ఏడాది కిందట మరమ్మతులు చేపట్టింది. ఇప్పుడు మరలా ఫ్లైఓవర్ బాగా దెబ్బతిన్నా.. బాధ్యత నాది కాదని కార్పొరేషన్ కూడా వదిలేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా వె ళ్లే భారీ వాహనాలన్నీ దీని మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. ఇలాగే సాగితే ఫ్లై ఓవర్ దెబ్బతింటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గతుక్కుమనాల్సిందే..
విజయనగరం సమీపంలో బైపాస్ రోడ్డు నుంచి గుంకలాం పేదల లే అవుట్‌కు వెళ్లే రోడ్డు దుస్థితి ఇది. మోకాలి లోతు గోతులతో ద్విచక్రవాహనాలు, కార్లు, మెటీరియల్ తీసుకువెళ్లే ట్రాక్టర్ల డ్రైవర్లుకు నరకం చూపిస్తోంది. విజయనగరం నుంచి బొబ్బిలి వెళ్లే మార్గంలో సీతారాంపురం వద్ద ఎప్పటికప్పుడు రోడ్డుకు గోతులు పడుతున్నాయి. విజయనగరం పట్టణం గాజులరేగ నుంచి జెఎన్‌టీయ, మెడికల్ కళాశాల, గిరిజన విశ్వవిద్యాలయం వైపు రహదారి గోతులమయమైంది.
గుంతల్లో నిరసన నాట్లు
చిత్తూరు జిల్లా యాదమరి మండలం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డులో మోకాల్లోతు తేలిన గుంతల్లో వాన నీరు చేరి.. సంద్రాన్ని తలపిస్తోంది. 3 రోజుల క్రితం ఈ గుంతల్లో వరినారు నాటి టీడీపీ నేతలు నిరసన తెలిపారు.
సీఎంగారూ.. చూశారా!
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రోడ్ల పరిస్థితికి ఈ ఫొటో అద్దం ప డు తోంది. కడప నుంచి మాచుపల్లె వెళ్లే రోడ్డం తా గుంతలమయంగా మారింది. వర్షం వస్తే మోకాలిలోతున నీళ్లు నిలుస్తున్నాయి. రోడ్డు అని బండి పోనిచ్చి గుంతలో బోల్తా పడిపోతున్నారు.
దిగ్గజాలున్నా రోడ్డుకు దిక్కులేదు
శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గం. ఆమదాలవలస స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ స్థానం. ఈ రెండు ప్రాంతాలను కలిపే రోడ్డు బలగ వద్ద గుల్లయింది. ఈ రోడ్డు విస్తరణ పనులు ఏళ్ల తరబడి నుంచి సాగుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయి నిధులు మంజూరు కాకపోవడంతో అక్కడక్కడ రోడ్డు వేశారు. మిగిలిన చోట్ల ఇదిగో ఇలా రాళ్లువేసి రోలింగ్ చేశారు. మరికొన్నిచోట్ల గుంతలను అలానే వదిలేశారు.
అర్ధంతరంగా వదిలేశారు..
డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడు తాపేశ్వరం మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిలో సగం సీసీ రోడ్డు వేసి వదిలేశారు. నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు ఆపేశారు. దీంతో దారీ..తెన్నూ లేకుండా ప్రమాదకరంగా మారిన దృశ్యం ఇది.
పేరుకే రిపేరు
గుంటూరు నగర పరిధిలోని జీఎన్‌టీ రోడ్డులోని మస్తాన్‌దర్గా, వెస్టు ప్యారిస్ చర్చి వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఈ మధ్యే రిపేర్లు చేశారు. నాలుగైదు రోజులు వానలు పడటంతోనే మళ్లీ యథాస్థితికి ఈ రోడ్డు చేరుకుంది. ఇప్పుడు వెళ్లి చూస్తే.. రోడ్డుకు అనేక చోట్ల ఇలా పాట్‌హోల్స్ కనిపిస్తున్నాయి. వేసవికాలంలో రోడ్లకు ప్యాచ్‌వర్కులు చేస్తారు. వర్షాకాలం వచ్చి ముసురువాన పట్టగానే అవి నామరూపాలు కోల్పోయి మళ్లీ గుంతలు తేలుతున్నాయి.
గోతులు తేలిన నిర్లక్ష్యం
రెండు రోజుల కిందట కురిసిన వర్షానికి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల - ఆకివీడు రహదారి అధ్వానంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్యాచ్ వర్కులు మినహా కనీసం తాత్కాలిక రోడ్ల కోసం నిధులు కూడా విడుదల చేయలేదు.
కనెక్టివిటీ ఇలాగేనా...శ్రీ
కావలి-తుమ్మలపెంట..నెల్లూరు జిల్లాలోని కీలకమైన కనెక్టివిటీ రోడ్లలో ఒకటి. కానీ, ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రజలు వణికిపోతున్నారు. రాజుపాలెం-ఇస్కపల్లి రోడ్డు, నందవరం-ఉదయగిరి రోడ్డు, నెల్లూరు- పొదలకూరు- సైదాపురం రోడ్డు తదితర అనుసంధాన రహదారులూ అధ్వానంగానే ఉన్నాయి. నెల్లూరు నగరంలోని ప్రధాన గ్రాండ్ ట్రంకు రోడ్డు గుంతలమయంగా మారిపోయినా కనీసం ప్యాచ్‌లు కూడా వేయలేకపోతున్నారు.