Nara Lokesh Cm jagan: కేసులతో కట్టడి! ఈసారి గురి ఎవరిపై అంటే..!

ABN , First Publish Date - 2023-09-12T02:49:05+05:30 IST

చంద్రబాబు, లోకేశ్‌.. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు.. ఆ పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్లు కూడా. దరిదాపుగా ఆరు నెలల నుంచి జనంలోకి విస్తృతంగా వెళ్తున్నారు.

 Nara Lokesh Cm jagan: కేసులతో కట్టడి! ఈసారి గురి ఎవరిపై అంటే..!

  • బాబు, లోకేశ్‌ జనంలోకి వెళ్లకుండా జగన్‌ కేసుల వ్యూహం!

  • ఒకదాని వెంట మరొకటి మోపాలని ఎత్తు

  • ఎన్నికల ముందు వారిద్దరూ కదలకుండా అడ్డుకునేందుకే!

  • జగన్‌ అండ్‌ కో ఎత్తుగడ.. పసిగట్టిన టీడీపీ.. ఎదుర్కోవడానికి కసరత్తు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): చంద్రబాబు, లోకేశ్‌.. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు.. ఆ పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్లు కూడా. దరిదాపుగా ఆరు నెలల నుంచి జనంలోకి విస్తృతంగా వెళ్తున్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో చంద్రబాబు.. పాదయాత్రతో లోకేశ్‌ ప్రజల్లోనే ఉంటున్నారు. జగన్‌ పాలనను దునుమాడుతున్నారు. వారి కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున హాజరవుతుండడం.. వివిధ వర్గాలు తమ తమ సమస్యలను వారికి చెబుతుండడం.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వారు కూడా హామీలిస్తుండడం.. ఎన్నికల మేనిఫెస్టోను ప్రాథమికంగా ప్రకటించడం.. మేనిఫెస్టో హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఊరూరా పార్టీ సమావేశాలు పెడుతుండడం.. వాటిపై ప్రజలు ఆసక్తి చూపుతుండడం వైసీపీ పెద్దలకు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికక్కడ ఇద్దరు అగ్ర నేతలను అడ్డుకునేందుకు పోలీసులను, వైసీపీ శ్రేణులను పురిగొల్పుతున్నారు. మొదట్లో దీనిని సహించిన టీడీపీ శ్రేణులు ఇటీవల ప్రతిఘటిస్తున్నాయి. కొన్ని చోట్ల ఎదురుదాడులకూ దిగుతున్నాయి. ఇది టీడీపీ కేడర్‌లో జోష్‌ పెంచింది. ఈ పరిణామం వైసీపీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు. బాబు, లోకేశ్‌ను కట్టడి చేస్తేనే వచ్చే ఎన్నికల్లో గెలవగలుగుతామని.. లేదంటే ఓటమి ఖాయమని కలవరపడుతోంది. అందుకే వారిని, కీలక నేతలను, కేడర్‌ను కేసుల్లో ఇరికించేందుకు భారీ కసరత్తే చేస్తోంది. వీరిద్దరిపై ఒకదాని వెంట మరొకటిగా కేసులు మోపి జైల్లో దిగ్బంధించాలని చూస్తోంది. ఈ కేసుల వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కోర్టు ఆయనకు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపింది. దాంతో ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. బెయిల్‌ కోసం ఆయన తరఫు న్యాయవాదుల బృందం ఇంకా పిటిషన్‌ కూడా దాఖలు చేయకముందే సీఐడీ ఆయనపై మరో కేసుకు సంబంధించిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టులో సోమవారం దాఖలు చేసింది. రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు(ఐఆర్‌ఆర్‌) కేసులో ఆయన్ను విచారించడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పీటీ వారెంటు పిటిషన్‌ను వేశారు. అంటే స్కిల్‌ కేసులో ఆయనకు ఒకవేళ బెయిల్‌ వచ్చినా వెంటనే మరో కేసులో నిర్బంధించడానికి వీలుగా ఈ వారెంటును దాఖలు చేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ రకంగా మొత్తం ఆరేడు కేసుల్లో ఆయనపై వెంట వెంటనే పీటీ వారెంట్లు దాఖలు చేయడానికి ప్రభుత్వ ఆదేశంతో పోలీసు విభాగం సమాయత్తమైంది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సీఐడీ ఇప్పటికే నాలుగైదు కేసులు నమోదు చేసింది. ఇందులో ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ కేసు, రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూముల కేసు, రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు వంటివి ఉన్నాయి. చంద్రబాబు పర్యటన సమయంలో చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పుంగనూరు, అంగళ్లులో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై హింసాత్మక దాడులకు దిగారు. పోలీసులు వారికి అడ్డుకోకపోగా తమపై లాఠీచార్జికి ఉపక్రమించడంతో మండిపడిన టీడీపీ కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించారు. ఇందులో కూడా చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ పోలీసులు కేసులు నమోదు చేశారు. అంగళ్లు ఘటనలో ఆయన్నే మొదటి నిందితుడిగా చూపించారు. ఈ ఘటనల్లో కూడా ఆయన్ను అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. వీటన్నింటిలో ఒకేసారి అరెస్టు చూపించకుండా..ఒక కేసులో బెయిల్‌ వచ్చే సమయానికి మరో కేసులో అరెస్టుచేసి వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లోనే ఉంచాలన్నది జగన్‌ వ్యూహంగా చెబుతున్నారు.

లోకేశ్‌పైనా గురి!

చంద్రబాబు తనయుడు లోకేశ్‌పై కూడా కేసులు మోపి ఆయన్ను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించాలని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నారు. లోకేశ్‌పై కూడా విచారణ చేస్తున్నామని, ఆయనను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ గత ఆదివారం బహిరంగంగా విలేకరుల సమావేశంలోనే చెప్పారు. సాధారణ ఎన్నికలు మరో ఆరేడు నెలల్లో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్‌ రాష్ట్రమంతా కలియదిరుగుతున్నారు. వారిద్దరి సభలకు ప్రజలు పెద్దఎత్తున హాజరవుతున్నారు. దీంతో వీరిని అడ్డుకోవాలంటే.. కేసులకు మించిన వ్యూహం లేదని జగన్‌ అండ్‌ కో అంచనాకు వచ్చింది. దీనివల్ల రాజకీయ వ్యవహారాలను వారు పక్కన పెట్టేస్తారని, దాంతో టీడీపీ ఎన్నికల సన్నద్ధత దెబ్బ తింటుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. టీడీపీ నాయకత్వం కూడా దీనిని పసిగట్టింది. దీనికి దీటుగా స్పందించడంపై కసరత్తు చేస్తోంది. ‘మంచి న్యాయవాదుల బృందాన్ని సిద్ధం చేసుకుని.. ఒకరిద్దరు నేతలకు బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. ప్రభుత్వం పెడుతున్న కేసుల్లో బలం లేదు. అవి రాజకీయ ప్రేరితం.. కక్షపూరితమైనవే. అవి ఎన్ని పెడితే ఎన్నికల ముందు మాకు అంత మంచిది. మమ్మల్ని వేధిస్తున్నారని ప్రజలకు అర్థమైపోవడంతో మా పని ఇంకా సులువు కానుంది’ అని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఆరేడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం కూడా ఉంది. కేసులు, దాడులతో బెంబేలెత్తి నాలుగేళ్లు స్తబ్ధుగా ఉండిపోయిన టీడీపీ శ్రేణుల్లో గత కొంతకాలంగా ఉత్సాహం ఉరకలేస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌ జనంలోకి విస్తృతంగా వెళ్తుండడమే దీనికి కారణం. వీరిద్దరినీ కేసుల్లో ఇరికించి జైళ్లలో దిగ్బంధిస్తే టీడీపీని నడిపేవారే ఉండరని.. అప్పుడు రెండోసారీ తన గెలుపు సునాయాసమవుతుందని జగన్‌ గట్టిగా భావిస్తున్నారని.. అందుకే కేసుల అస్త్రాన్ని బయటకు తీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - 2023-09-12T12:31:32+05:30 IST