Palnadu Dist.: మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ అరెస్టు.. టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్..

ABN , First Publish Date - 2023-04-09T11:42:43+05:30 IST

అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చేసుకున్న సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

Palnadu Dist.: మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ అరెస్టు.. టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్..

పల్నాడు జిల్లా: అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చేసుకున్న సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ముందుగా టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి అమరలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు శ్రీధర్‌ను అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేసి పలువురిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కొమ్మాలపాటి మండిపడ్డారు. ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.

కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ అమరావతిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. నదిలో తవ్విన గోతుల వల్లే అనేకమంది చనిపోతున్నారన్నారు. టీడీపీ పాలన నాటి అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమన్నారు. అలాగే ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, ఇళ్ల నిర్మాణంపై చర్చకు కూడా సిద్ధమన్నారు. వైసీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, ఆధారాలతో సహ చర్చకు వచ్చామని కొమ్మాలపాటి శ్రీధర్‌ పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే శంకర్రావు కూడా అమరలింగేశ్వర ఆలయానికి వచ్చారు. తాను ఆధారాలతో వచ్చానని, ఏ తప్పు చేయలేదని అన్నారు. టీడీపీ వాళ్లు ప్రమాణం చేస్తే.. తాను కూడా ప్రమాణం చేస్తానని అన్నారు. అప్పటి వరకు ఆలయం వద్దే ఉంటానని స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యేకు మద్దతుగా వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కొమ్మాలపాటి శ్రీధర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. పసుపుచీర కట్టుకున్నాన్న కారణంతో తనను అరెస్టు చేశారని ఓ మహిళ వాపోయింది. కాగా ఉద్రిక్తతల నేపథ్యంలో అమరేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిని పోలీసులు మూసివేశారు.

Updated Date - 2023-04-09T11:42:43+05:30 IST