Janasena: జనసేన క్రియాశీలక సమావేశంలో నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-04T17:37:51+05:30 IST
వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే దాడులు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పోలీసు కేసులను జనసేన నాయకులు, సైనికులు తట్టుకున్నారు. నాయకులు కూడా ప్రెస్‌మీట్‌లకు పరిమితం కావద్దు. క్షేత్ర స్థాయిలో
అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి యాత్రతో ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మాట్లాడారు. ‘‘వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే దాడులు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పోలీసు కేసులను జనసేన నాయకులు, సైనికులు తట్టుకున్నారు. నాయకులు కూడా ప్రెస్‌మీట్‌లకు పరిమితం కావద్దు. క్షేత్ర స్థాయిలో సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారం కోసం కృషి చేయండి. ఎవరో పిలవలేదు... చెప్పలేదు అనే భావన విడనాడండి. జనసేన పార్టీ తరపున ఎటువంటి కార్యక్రమం పెట్టినా అందరూ భాగస్వామ్యం కావాలి. ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంది. అందరూ కలిసి పనిచేయాలి... అధికారంలోకి రావాలి. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలను తెలుసుకోండి. మన వీర మహిళలను ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. వచ్చే ఎన్నికలలో జనసేన విజయం ద్వారా రాష్ట్రానికి మేలు చేద్దాం.’’ అని పిలుపునిచ్చారు.
‘‘ఏపీలో వ్యవస్థలను ఈ ప్రభుత్వం నాశనం చేసింది. భవిష్యత్తు తరాల కోసం మన పార్టీ కోసం కష్టం పడి పని చేయాలి. గ్రామ, మండల, నియోజకవర్గం స్థాయిలో సమావేశాలు పెట్టుకోండి. అందరూ కలిసి పని చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోండి. పార్టీ అన్నాక కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. వాటిని పాజిటివ్ కోణంలో చూడాలే తప్ప.. తప్పుగా అర్థం చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ ఎటువంటి పిలుపు ఇచ్చినా దానిని అందరూ అమలు చేయాలి. నియోజకవర్గాల్లో నాయకులు విడివిడిగా కార్యక్రమాలు పెట్టిన విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఇక నుంచి ఎవరికివారు కాదు.. అందరూ కలిసే పార్టీ కార్యక్రమం చేయాలి. పార్టీ సమావేశాలకు కూడా ఆహ్వానితులు మాత్రమే రావాలి.’’ అని ఆదేశించారు.
‘‘వారాహి యాత్ర మూడో విడత విశాఖలో ఆగష్టు 10 నుంచి ప్రారంభం అవుతుంది. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకున్న దోచుకున్న అంశాలను వివరిస్తాం. విశాఖలో జరిగిన భూ దోపిడీని వెలుగులోకి తెస్తాం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్‌ను గౌరవించిన తీరు అందరూ చూశారు. నిజాయితీగా, పట్టుదలగా ప్రజల కోసం పని చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయాలతో ఏకీభవించారు. పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా అది రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల మంచి కోసమే. అమరావతి రాజధాని కాబట్టే ఇక్కడ భూములు కొని పార్టీ కార్యాలయం నిర్మాణం చేశారు. ఇక్కడ నుంచే పార్టీ కార్యకలాపాలు మొత్తం సాగుతాయి. మత్స్యకారులు, చేనేత కార్మికులు కోసం కమిటీలు వేస్తాం. షణ్ముఖ వ్యూహం గురించి అందరూ తెలుసుకోవాలి, ఆచరించాలి. బటన్ నొక్కామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. వాళ్లు చేసే మోసాలు, మాయలు మనమే ప్రజలకు చెప్పాలి. ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తాం. ఆ ప్రాంతం నుంచి ఎవరూ వలస వెళ్లకూడదు.. అక్కడే ఉపాధి చూపించాలి. మేము ప్రజల కోసం ఇది చేస్తాం అని చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. జనసేన జనంతోనే ఉంటూ, జనం కోసమే పని చేసే పార్టీ. పవన్ విజన్ కోసం కలిసి పని చేయండి.. పొరపొచ్చాలు ఉంటే విడనాడండి.’’ అని నేతలను కోరారు.
‘‘రాష్ట్రంలో అనేక చోట్ల ఓట్లను కూడా తొలగించారు. ఒకే డోర్ నెంబర్‌తో వందల ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితా తెప్పించుకుని ఓట్లు అందరికీ ఉండేలా చూడండి. ఓటర్ల జాబితా తీసుకుని డోర్ టూ డోర్ వెరిఫికేషన్ చేయండి. దుర్మార్గంగా తొలగిస్తున్న ఓట్లను తిరిగి చేర్చేలా చూడండి. మై ఓటు ఫర్ జనసేన అనే నినాదాన్ని ప్రజలకు వివరించండి. జనసేన సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వచ్చింది. నేడు ప్రతి గ్రామంలో మన పార్టీ వాళ్లు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనసేన నాయకులు ఉన్నారు. జనసేన పార్టీ అంటే ప్రజల పార్టీ అనే నమ్మకం కలిగించాం. అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు కష్టపడి పనిచేయండి. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం అందరూ పని చేయండి.’’ అని నేతలకు నాదెండ్ల మనోహరో దిశానిర్దేశం చేశారు.