Lokesh YuvaGalama: లోకేశ్ ఇంకా అడుగుపెట్టనే లేదు.. మంగళగిరిలో అప్పుడే మొదలైన వివాదం
ABN , First Publish Date - 2023-08-14T14:51:32+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అధికారపక్షం ఏదోరకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది.
అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) మొదలైనప్పటి నుంచి అధికారపక్షం ఏదోరకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటి వరకు యువనేత పాదయాత్ర చేసిన ప్రతీ జిల్లాలోనూ వైసీపీ నేతలు ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీల విషయంలో, పాదయాత్ర జరిగే ప్రాంతాలకు సంబంధించి, రూట్ మ్యాప్ ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోకి లోకేశ్ ఎంట్రీ కాకముందే వివాదం రాజుకుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో యువనేత పాదయాత్ర సాగుతోంది. రేపటి (మంగళవారం) నుంచి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. నాలుగు రోజులపాటు మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. అయితే మంగళగిరి నియోజకవర్గంలోకి నారా లోకేష్ పాదయాత్ర రాకముందే వివాదం మొదలైంది. నారా లోకేష్‌కు స్వాగతం పలుకుతూ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఇక్కడ కూడా అడ్డంకులు వచ్చిపడ్డాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఫ్లెక్సీల ఏర్పాటును అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కార్పొరేషన్ కమిషనర్ శారదదేవి అనుమతి ఇవ్వని పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి టీడీపీ నేతలను కలిసేందుకు కార్పొరేషన్ కమిషనర్ అనుమతి నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే ఆర్కే, కమిషనర్ డౌన్ డౌన్ అనే నినాదాలతో మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం దద్దరిల్లింది. భారీగా టీడీపీ శ్రేణులకు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దీంతో ఎలాంటి ఘటనకు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.