Sand: మహా మాయ!
ABN , First Publish Date - 2023-08-21T03:38:27+05:30 IST
మేడిపండు చూడ మేలిమై ఉండు... పొట్ట విప్పిచూడ’ అన్నట్లుగా ఇసుక వ్యవహారంలో తొలి నుంచీ ఎన్నో ట్విస్టులు! 2016లో టీడీపీ ప్రభుత్వం(TDP Govt) ఇసుకను ఉచితం చేసింది. జగన్ సర్కారు(Jagan Govt) వచ్చాక కొత్త ఇసుక పాలసీ(New sand policy) పేరిట 2019లోనే ఇసుకను అమ్మకం సరుకుగా మార్చేసింది.
ఇసుక దందాలో మరో కొత్త కోణం
జూన్ 6న జీఎ్‌సటీ నంబర్ సస్పెన్షన్.. అయినా జేపీ పేరిటే వే బిల్లులు
మే 13నే ముగిసిన జేపీ కాంట్రాక్టు
ఇసుక వ్యాపారానికి ఎప్పుడో దూరం
అయినా సస్పెండైన జీఎ్‌సటీ నంబర్‌తో
యథేచ్ఛగా బిల్లులు.. అడ్డగోలు తరలింపులు
ఆ సంస్థ పేరిట ‘ఎవరో’ అక్రమ అమ్మకాలు
తెర వెనుక ‘పెద్దలు’ ఉన్నట్టు అనుమానాలు
గతంలో ఆలస్యంగా జీఎస్టీ చెల్లింపులు
గనులు, వాణిజ్య పన్నుల శాఖ మౌనం
ఇసుక అక్రమాల్లో(sand irregularities) ‘తవ్వేకొద్దీ’ కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇదో మహా మాయాజాలంలా నడుస్తోంది. ఎన్నడూ వినని మహా జగన్నాటకం. ఎప్పుడూ జరగని గోల్‌మాల్ వ్యవహారం. జేపీ వెంచర్స్... టర్న్‌కీ... ప్రభుత్వ పెద్దలు.. ‘పేరు’ ఏదైనా తెరవెనుక అక్రమ ‘బాగోతం’ సాగిపోతోంది.
జేపీ వెంచర్స్, టర్న్‌కీ కాంట్రాక్టు మే 13నే ముగిసింది. ఆ వెంటనే ఇసుక అమ్మకాలు గనుల శాఖ నియంత్రణలోకి రావాలి. అయితే ఇప్పటికీ జేపీ వెంచర్స్, టర్న్‌కీ వే బిల్లుల మీదనే ఇసుక తరలిపోతోంది. అంతేనా.. మరో నిప్పులాంటి నిజం బయటపడింది. జేపీ వెంచర్స్ జీఎ్‌సటీ నంబర్ జూన్ 6న సస్పెండ్ అయింది. అంటే.. ఆ సంస్థ ప్రభుత్వానికి జీఎస్టీ కట్టదు. ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేయదు.
ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బంతా ఎక్కడికో చేరిపోతోంది. ఇందులో కంపెనీలతో పాటు ప్రభుత్వ వ్యవస్థలను భాగస్వామ్యం చేయడం విశేషం. ప్రైవేటు వ్యాపారం పేరుతో తెరవెనక ‘పెద్దలు’ కోట్ల వ్యవహారం నడిపిస్తున్నారు. ఇందులో ఎందరో మహా మాయగాళ్లు ఉన్నారు.
జేపీ ఎందుకు స్పందించడం లేదు?
తమ పేరిట బిల్లులు ఇస్తే తామే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని జేపీ వెంచర్స్, టర్న్‌కీలకు తెలియని విషయం కాదు. పైగా తాము చేయని వ్యాపారానికి తమ పేరిట వే బిల్లులు ఇవ్వడం నేరం. ఈ విషయం తెలిసి కూడా జేపీ సంస్థ ఇప్పటి దాకా ఎందుకు స్పందించడం లేదు? పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఈ మౌనం వెనుక ఉన్న బలమైన శక్తులు ఎవరు?
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘మేడిపండు చూడ మేలిమై ఉండు... పొట్ట విప్పిచూడ’ అన్నట్లుగా ఇసుక వ్యవహారంలో తొలి నుంచీ ఎన్నో ట్విస్టులు! 2016లో టీడీపీ ప్రభుత్వం(TDP Govt) ఇసుకను ఉచితం చేసింది. జగన్ సర్కారు(Jagan Govt) వచ్చాక కొత్త ఇసుక పాలసీ(New sand policy) పేరిట 2019లోనే ఇసుకను అమ్మకం సరుకుగా మార్చేసింది. ఆ తర్వాత కొత్త పాలసీలో మరిన్ని మెరుగుల పేరిట ఇసుక అమ్మకాల నుంచి గనుల శాఖను తప్పించి ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. నేరుగా తామే ఓ కంపెనీని పిలిచి టెండర్ కట్టబెట్టవచ్చు. కానీ ఓ కేంద్ర సంస్థ ద్వారా టెండర్లు జరిపించి తెలిసిన సంస్థ అయిన జేపీ వెంచర్స్‌కు టెండర్(Tender to JP Ventures) దక్కేలా తెర వెనుక వైసీపీ ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. 2021 మే 13వ తేదీన జేపీ వెంచర్స్ సంస్థతో ఏపీ గనుల శాఖ ఇసుక అమ్మకాలపై ఒప్పందం చేసుకుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. సరిగ్గా అదే రోజు జేపీ సంస్థ ఏపీలో జీఎస్టీ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంది. విజయవాడలోని రామవరప్పాడు ఆఫీసు నుంచి ఈ నంబర్ తీసుకుంది. రెండేళ్లపాటు ఇసుక అమ్మకం కాంట్రాక్టు దక్కించుకున్న ఆ సంస్థ వ్యాపారంలో సహకారం కోసం టర్న్‌కీ అనే సంస్థను తెచ్చిపెట్టుకుంది. ఈ కంపెనీ.. ఇసుక టెండర్ ఒకే కావడానికి ముందు 2020 డిసెంబరు 30న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో రిజిస్టర్ అయింది. చెన్నె, హైదరాబాద్, కర్నూలుకు చెందినవారు ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు ముఖ్యనేత సామాజికవర్గం వారే. డొంక తిరుగుడు వ్యవహారం కంటే టర్న్‌కీనే నేరుగా టెండర్లలో పాల్గొని ఇసుక కాంట్రాక్టు తీసుకోవచ్చుకదా అనే సందేహం రావచ్చు. కానీ టెండర్లలో పాల్గొనే అర్హత ఆ సంస్థకు లేదు. జేపీ వెంచర్స్‌కు టెండర్ వచ్చాక ఉప కాంట్రాక్టు పేరిట టర్న్‌కీ తెరపైకి వచ్చింది. టర్న్‌కీ ఇసుక వ్యాపారంలోకి దిగిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేపీ పాత్ర నామమాత్రంగా మారింది. అధికార నేతల ఒత్తిళ్లు, బెదిరింపులు భరించలేక టర్న్‌కీ కూడా గత సెప్టెంబరులోనే వ్యాపారానికి దండం పెట్టి తప్పుకొంది. ఆ తర్వాత జేపీ వెంచర్స్-టర్న్‌కీ పేరిటే ఇసుక వ్యాపారం ఈ ఏడాది మే 12 వరకు సాగింది. టెండర్ ఒప్పంద కాలపరిమితి మే 13 నాటికి ముగిసిపోయింది. ఒప్పందం మేరకు ఇసుక అమ్మకాల నుంచి జేపీ గ్రూప్ తప్పుకొన్నట్లే.
కాంట్రాక్టు ముగిసినా అవే బిల్లులు
జేపీతో ఒప్పందం గడువు ముగిశాక తక్షణమే ఇసుక అమ్మకాలు గనులశాఖ నియంత్రణలోకి రావాలి. గనుల శాఖే ఇసుక అమ్మకాల నిర్వహణ చేపట్టాలి. ఇందుకు మార్గదర్శకాలు ఇవ్వాలి. అయితే అవేమీ జరగలేదు. అటు కాంట్రాక్టు సంస్థ ఒప్పందం ముగిసింది. గనులశాఖ కూడా ఇసుక అమ్మకాలు చేపట్టలేదు. ఇటు ప్రభుత్వం మరో సంస్థకు టెండర్ ఇవ్వనేలేదు. అయినా ఇసుక అక్రమ తవ్వకాలు మాత్రం ఆగలేదు. మరి ఇప్పుడు ఇసుక వ్యాపారం చేస్తున్నదెవరు? దీనిపై గనుల శాఖ, సర్కారు నోరువిప్పడం లేదు. ఈ మౌనం వెనక కారణాలు ఎలా ఉన్నా... అనధికారికంగా ఇసుక అమ్మకాలు ఇంకా జేపీ వెంచర్స్-టర్న్‌కీ పేరిటే సాగుతున్నాయి. వాటి పేరిటే వే బిల్లులు ఇస్తున్నారు. దానిపై జేపీ వెంచర్స్ జీఎస్టీ నంబర్‌తో పాటు టర్న్‌కీ రూపొందించిన బార్‌కోడ్ ఉంటోంది. ఈ విషయాన్ని ఇటీవలే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ బిల్లులు నిజమైనవేనా? నిజంగా జేపీ వెంచర్స్ ఇసుక అమ్మకాలు చేస్తోందా? అంటే అంతా ఒట్టిమాటే అని స్పష్టమవుతోంది. జేపీ వెంచర్స్ కాంట్రాక్టు ముగిశాఖ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ జీఎస్టీ నంబర్ ఈ ఏడాది జూన్ 6న సస్పెండ్ అయింది. అగ్రిమెంట్ ముగిసిన 23రోజులకే ఇది జరిగింది. దీంతో నిబంధనల ప్రకారం ఆ నంబర్ చెల్లుబాటు కాదు. ఆ కంపెనీ జీఎస్టీ చెల్లించదు. దీన్నిబట్టి కాంట్రాక్టు గడువు ముగిసినతర్వాత ఇసుక వ్యాపారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జేపీ వెంచర్స్, టర్న్‌కీ లేవని స్పష్టమవుతోంది. అయినా క్షేత్రస్థాయిలో వారి వేబిల్లులే కనిపిస్తున్నాయి.
సర్కారు మౌనముద్ర
మే 14వ తేదీ నుంచి సాగుతున్న ఇసుక అమ్మకాలు ఎవరి కనుసన్నల్లో సాగుతున్నాయి? గత మూడు నెలలుగా ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే రూ.వందల కోట్ల సొమ్ము ఎవరికి చేరుతోంది? గనుల శాఖకు రాయల్టీ, ప్రభుత్వానికి జీఎస్టీ పోతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం, గనుల శాఖ, జీఎస్టీ వసూలు చేసే వాణిజ్య పన్నుల శాఖలు ఇసుక దందాపై మౌనంగా ఉన్నాయంటే ఎవరో ‘పెద్దలు’ ఆదేశిస్తే తప్ప సాధ్యంకాదు. అంటే.. ఇసుక దందాలో ప్రభుత్వ వ్యవస్థలు కూడా భాగస్వాములైనట్లే అని సామాన్యుడు భావించేలా సర్కారు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జేపీ జీఎస్టీ కథే వేరు
మధ్యప్రదేశ్‌కు చెందిన జేపీ వెంచర్స్ వివిధ రాష్ట్రాల్లో పలురకాల కాంట్రాక్టులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు చేపట్టకముందే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 14 జీఎస్టీ నంబర్లు కలిగి ఉంది. జీఎస్టీ చెల్లింపులు మధ్యప్రదేశ్‌లో ఒకలా, ఆంధ్రప్రదేశ్‌లో మరోలా చేసింది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొంతవరకు పద్ధతి మేరకే పన్నులు చెల్లించింది. అదే ఏపీలో జరిపిన పన్ను చెల్లింపులను పరిశీలిస్తే తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం కనిపిస్తుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి జూన్, జూలై నెల జీఎస్టీ బకాయిలు నవంబరులో చెల్లించింది. 2022 ఆగస్టు బకాయిలను ఈ ఏడాది జనవరి 5న, గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు బకాయిలను ఈ ఏడాది మార్చి 13న చెల్లించింది.. గత ఏడాది నవంబరు. డిసెంబరు జీఎస్టీని ఈ ఏడాది జూన్ 22వ తేదీన చెల్లించింది. ఇక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి జీఎస్టీని జూన్ 22న, మార్చి నెల జీఎస్టీని ఈ నెల 16న చెల్లించింది. ఈ చెల్లింపులను పరిశీలిస్తే రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సకాలంలో జీఎస్టీని చెల్లించలేదు. ఒక నెల బకాయిని ఐదారు నెలల తర్వాత చెల్లించింది. చివరి 10 నెలల చెల్లింపులను ఏనాడు సకాలంలో చెల్లించనేలేదు. అయినా ఆ సంస్థపై ఎలాంటి చర్యలు లేవు. నోటీసులు లేవు. విచారణా లేదు. సామాన్యులు, చిరు వ్యాపారులు ఇదే పని చేస్తే వారి జీవితాలను రోడ్డుమీదకు లాగే ప్రభుత్వం... జేపీ విషయంలో ఎందుకు మిన్నుకుండిపోయింది? మరో కీలకమైన అంశం ఏంటంటే.... కాంట్రాక్టు ముగిసిన (మే నెల) తర్వాత గత ఏడాది బకాయిలతో పాటు ఈ ఏడాది మార్చి వరకు జీఎస్టీని చెల్లించింది. ఇదెలా సాధ్యం? ఇంతటి జాప్యం చేసిన ఆ సంస్థపై ఇటు సర్కారు, అటు జీఎస్టీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ఏడాది ఏప్రిల్, మే నెల బకాయులు ఇంకా చెల్లించాల్సి ఉంది. బిల్లులు చెల్లించకముందే జీఎస్టీ నంబర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడుజేపీ వెంచర్స్ పేరిట ఇస్తున్న వే బిల్లులపై సస్పెండ్ అయిన జీఎస్టీ నెంబరే ఉంది.
ఇంతకీ వ్యాపారం చేస్తున్నదెవరు?
జీఎస్టీ చెల్లింపులను పరిశీలిస్తే అసలు ఇసుక వ్యాపారం జేపీ వెంచర్స్, టర్న్‌కీ చేశాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పేరున్న ఏ కంపెనీ కూడా ఆలస్యంగా పన్నులు చెల్లించదు. జీఎస్టీలను పెండింగ్ పెట్టదు. దానివల్ల కంపెనీల రేటింగ్ పడిపోతుంది. అదే జరిగితే మార్కెట్‌లో వాటి విలువ తగ్గిపోతుంది. ఇతర రాష్ట్రాల్లో సమయానికి జీఎస్టీలు చెల్లించిన జేపీ వెంచర్స్ ఏపీలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. పోనీ ఇక్కడ ఇసుక వ్యాపారం ఏమైనా తక్కువగా జరిగిందా అంటే అదీ లేదు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారం బాగా జరిగింది. కాబట్టి జేపీ సంస్థ నిజంగా ఇసుక వ్యాపారమే చేసి ఉంటే పన్నుల చెల్లింపులో ఆలస్యం చేసి ఉండదు. కానీ ఇక్కడ ఐదారు నెలలు ఆలస్యంగా పన్నులు కట్టింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పేరిట మరెవరైనా ఇసుక సామ్రాజ్యాన్ని నడిపారా? అన్న ప్రధాన ప్రశ్న ఉత్పన్నమవుతోంది.