Chintakayala Vijay: కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చా

ABN , First Publish Date - 2023-01-30T10:50:37+05:30 IST

‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారానికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Chintakayala Vijay: కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చా

గుంటూరు: ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారానికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ (TDP State General Secretary Chintakayala Vijay)కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈరోజు విజయ్ సీఐడీ విచారణకు రానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ... కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో తమ ఇంటిపై సీఐడీ అధికారులు వచ్చారని... చిన్న పిల్లలను కూడా బెదిరించారని అన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. తనను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పిందని అన్నారు. సీఐడీ విచారణకు సహకరించాలని వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారని.. అయితే ఆరోజు వేరే పని ఉండటంతో రాలేకపోయినట్లు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకుని ఇవాళ విచారణకు వచ్చానన్నారు. బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య గట్టిందని మండిపడ్డారు. సెంటు భూమి కోసం తమ ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారన్నారు. అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చింతకాయల విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతల మండిపాటు...

మరోవైపు విజయ్‌పై కేసు నమోదు చేయడం పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఉన్నత విద్యావంతుడైన విజయ్‌పై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister Devineni Umamaheshwar Rao) అన్నారు. తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్‌లో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజల కోసం పోరాడుతోందని... అందుకే వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి (TDP Leader Pattabhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్‌కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని.. సైకో ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Updated Date - 2023-01-30T10:50:38+05:30 IST