Chintakayala Vijay: సీఐడీ ఆఫీస్‌కు చేరుకున్న చింతకాయల విజయ్
ABN , First Publish Date - 2023-01-30T12:07:33+05:30 IST
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కాసేపటి క్రితమే జిల్లాలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు.
గుంటూరు: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ (TDP Leader Chitakayala Vijay)కాసేపటి క్రితమే జిల్లాలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయవాదులతో కలిసి విజయ్ సీఐడీ ఆఫీస్‌లోకి వెళ్లారు. ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారంలో విజయ్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వాగా... విచారణ నిమిత్తం ఆయన ఈరోజు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. గతేడాది సెప్టెంబరులో విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా విజయ్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే అదే రోజున వేరే కార్యక్రమాలు ఉండటంతో సీఐడీ విచారణకు హాజరుకాలేనని హైకోర్టులో చింతకాయల విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నేడు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. లాయర్ సమక్షంలో విచారణ జరపాలని కోర్టు సూచించింది. కోర్టు సూచన మేరకు ఈరోజు ఉదయం విజయ్ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విచారణకు ముందు మీడియాతో చింతకాయల....
కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో తమ ఇంటిపై సీఐడీ అధికారులు వచ్చారని... చిన్న పిల్లలను కూడా బెదిరించారని అన్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. సీఐడీ విచారణకు సహకరించాలని వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారని.. ఆరోజు వేరే పని ఉండటంతో రాలేకపోయినట్లు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకుని ఇవాళ విచారణకు వచ్చానన్నారు. అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయ్ వెంట టీడీపీ నేతలు... అడ్డుకున్న పోలీసులు
మరోవైపు.. చింతకాయల విజయ్ వెంట మాజీ మంత్రులు ఆలపాటి రాజా (Alapati Raja), నక్కా ఆనంద బాబు (Nakka Anandbabu) సీఐడీ కార్యాలయానికి వచ్చారు. అయితే మాజీ మంత్రులను పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు వీలు లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.